
పడుతూ లేస్తూ..!
- అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ అష్టకష్టాలు
- ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోయామన్న భావనలో నేతలు
- పొన్నాల అసైన్డ్ భూముల వ్యవహారంతో ఆత్మరక్షణలో..
- విప్ వెనక్కి తీసుకోవడంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పాత్రలో ఒదిగి పోవడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అష్టకష్టా లు పడింది. 19రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ రాణించలేకపోయిందన్న మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. డీఎల్‌ఎఫ్ భూముల వ్యవహారంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం ఏమీలేదని సీఎంతో సమాధానం చెప్పించడంలో మాత్రం విజయం సాధించింది.
ఇక పార్టీ ఫిరాయింపులను సీఎం ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి నేతృత్వంలో రెండ్రోజులపాటు సభ జరగకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. చివరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేసి, ఆ అంశాన్ని పక్కన పెట్టింది. ఈ రెండు అంశాలను మినహాయిస్తే... ఆ పార్టీ ప్రస్తావించిన అంశాలు, ఇచ్చిన వాయిదా తీర్మానాలు, సంధించిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రభావం చూపించలేక పోయాయి.
పొన్నాల ఏపీసోడ్‌తో అవస్థలు
పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భూ ఆక్రమణల ను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు తేవడం కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా వెనకేసుకు రావాలో అర్థం కాక సీఎల్పీ అవస్థలు పడింది. సీఎల్పీనేత జానారెడ్డి, కార్యదర్శి భట్టి విక్రమార్క.. కొంత ప్రయత్నం చేసినా.. ఈ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. చివరకు సభా సం ఘాన్ని ఆహ్వానించడం మినహా కాంగ్రెస్‌కు మరోదారి లేకుండా పోయింది. డీఎల్‌ఎఫ్ భూముల వ్యవహారంలోనూ తొలిరోజు ఇరుకున పడిన కాంగ్రెస్.. అసలు ఈ అంశంపై చర్చ జరగకపోతేనే బావుండని భావించింది. కానీ చివరకు సీఎల్పీ కార్యదర్శి భట్టివిక్రమార్క చేసిన వాదనతో సీఎం కేసీఆర్ ఒకింత తగ్గి.. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చారు.
ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!
సీఎల్పీ నేత తీరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందారు. తొలి రెండు మూడు రోజుల్లో టీడీపీ.. సమావేశాలను ఒక విధంగా హైజాక్ చేయగలిగింది. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర పోషించింది. సంక్షేమ పథకాలపై జరిగిన చర్చ సందర్భంగా కూడా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గట్టిగా పట్టుపట్టకుండా.. ఎస్‌ఎల్‌బీసీ పనులపై చర్చకు అంగీకరించడంతో నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మినహా, మిగిలిన వారంతా నిరసనగా బయటకు వచ్చేశారు. ‘అసలు మేం అనుకున్నదొకటి. అక్కడ జరిగిందొకటి. నేత మాటను కాదని మేం ఏం చేయగలుగుతాం.
అందుకే బయటకు వచ్చేశాం..’ అని పలువురు ఎమ్మెల్యేలు ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ విప్ జారీ చేసినా.. చివరకు ఉపసంహరించుకోవడంపై ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ‘విప్ ఉపసంహరణ, ద్రవ్య వినిమయ బిల్లుకు మద్దతు ఇవ్వడం అందరి సభ్యుల ఏకాభిప్రాయంతోనే జరిగింది’ అని జానారెడ్డి ప్రకటించినా.. ఎమ్మెల్యేల్లో చాలా మంది వ్యతిరేక అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
అడ్డంకిగా ‘జానా’ ఇమేజ్
కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఒక విధంగా సీఎల్పీకి అడ్డంకిగా మారింది. సభలో కాంగ్రెస్ ఎదురు దాడి చేసిన ప్రతీ సందర్భంలో.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులు సైతం జానాను పొగుడుతూ, ఆయనను అడ్డం పెట్టుకున్నారు. ‘శాసనసభలో ఉన్న అందరి సభ్యుల కంటే సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న జానారెడ్డి అనుభవాన్ని వినియోగించుకుంటాం అంటూ టీఆర్‌ఎస్ చాలాసార్లు మా నోళ్లు మూయించింది. మా నేత గౌరవానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సి వచ్చింది. దీంతో కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించలేక పోయాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.