నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): దొంగలను క్రమశిక్షణలో పెట్టాల్సిన జైలు కానిస్టేబుల్.. వారితోనే చేతులు కలిపాడు. ఎత్తుకొచ్చిన బంగారాన్ని విక్రయించేలా చోరులతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు గాను తులానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలతో ‘అగ్రిమెంట్’ చేసుకున్నాడు. సదరు చోరులు పట్టుబడడంతో ఆ కానిస్టేబుల్ ‘దొంగ వ్యవహారం’ బయటపడింది. నిందితుల అరెస్టు చేశామని, సదరు జైలు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్‌లోని అంబేద్కర్ కాలనీకి చెందిన బొమ్మెర్ల సోమేశ్, కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్ కాలనీకి చెందిన మహ్మద్ షాహిద్ పాత నేరస్తులు. గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో జైలులో ఉన్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. గత నవంబర్ 16న శిక్ష పూర్తి కావడంతో ఇద్దరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్ల ప్రవర్తన మారలేదు. నవంబర్ నుంచి జనవరి వరకు నిజామాబాద్ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏకంగా 15 సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వరుసగా చోరీలు జరుగుతుండంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో చోరీ చేసేందుకు రాగా, అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మొత్తం 12 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి 16 తులాల బంగారం, 50 తులాల వెండి, ఒక కెమెరా, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమేష్‌పై 30 కేసులుండగా, షాహిద్‌పై 28 కేసులు ఉన్నాయి. ఇందులో నాన్‌బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయని సీపీ తెలిపారు.
‘దొంగ’లతో కలిసిన కానిస్టేబుల్!
30 కేసుల్లో నిందితుడైన సోమేశ్, 28 కేసుల్లో ముద్దాయిగా ఉన్న షాహిద్ తరచూ జైలుకు వెళ్తుండే వారు. ఈ క్రమంలో వారికి జైల్ కానిస్టేబుల్ సయ్యద్ ఖలీమ్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు నిందితులతో చేతులు కలిపాడు. మీరు దొంగిలించిన సొత్తును అమ్మి పెడతానని, ఇందుకు ప్రతిఫలంగా తులానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని సోమేశ్, షాహిద్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో నిందితులు రెండు నెల వ్యవధిలో దొంగిలించిన సొత్తును సదరు కానిస్టేబుల్ వద్ద పెట్టారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలటంతో అధికారులు నివ్వెర పోయారు. వెంటనే సయ్యద్ ఖలీంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సీపీ తెలిపారు. దొంగలను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, 6వ టౌన్, మోపాల్, రూరల్ ఎస్సైలు లక్ష్మయ్య, సతీష్, శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్స్ గఫార్, రమేశ్, కానిస్టేబుల్స్ ముఖీం, ఈశ్వర్, పోచయ్య, సురేశ్, శ్రీకాంత్, లింబాద్రి, పవన్‌లను అభినందించిన సీపీ.. వీరికి రివార్డులు అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment