వరంగల్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. అయితే ఈ పనులన్నీ ఆన్‌లైన్ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహిస్తామని ప్రకటించడంతో చిన్నచిన్న కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ల కోసం పోటీ పడుతున్నారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో రూ.5లక్షల వరకు చేసే పనులు నామినేషన్‌పై చేసేందుకు వీలుండేది. అయితే రాష్ట్ర విభజనతో పాటు సార్వత్రిక ఎన్నికల సమయంలో గవర్నర్ నరసింహ న్ రూ.లక్షకు మించిన పనులన్నీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారానే చేపట్టాలని ఏప్రిల్ 1వ తేదీన ప్రత్యేక జీఓ జారీ చేశారు.
దీంతో అప్పటి నుంచి ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించే పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా నామినేషన్ల జీఓను జారీ చేయలేదు. అయితే నామినేషన్లపై పనులు అప్పగించే జీఓను జారీ చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, గత సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు చెరువులు దెబ్బతిన్నాయి. అయితే ఈ చెరువులను తాత్కాలికంగా, శాశ్వతంగా మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. కాగా, ఈ పనులను తాత్కాలికంగా స్థానిక రైతులు, కాంట్రాక్టర్లతో చేయించారు. అయితే నిధులు మంజూరైతే పనులు చేసిన వారికి చెల్లింపులు చేయాలంటే కొత్త జీఓ మూ లంగా వీలు లేకుండా పోతోంది. కాగా, వీటితో పాటు స్థానిక సంస్థలకు చెందిన పాలకవర్గాలు రూ.లక్షకు పైగా పనులు చేపట్టేందుకు కూడా జీఓ అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది. అయితే ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు నామినేషన్లపై పనులు అప్పగించేందుకు మరో జీఓ జారీ చేయాలని మంత్రివర్గ ఉప సంఘం కూడా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఎక్కడైనా పనులు చేసుకోవచ్చు..
చిన్న పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహిస్తే కాంట్రాక్టర్లు ఎక్కడి నుంచైనా వేసే వీలుంటుంది. అయితే పనులు పొందేందుకు కాంట్రాక్టర్లు పోటీపడి పెద్దఎత్తున లెస్ (తక్కువ మొత్తానికి) టెండర్లు దాఖలు చేసే వీలుంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. కాగా, తక్కువ మొత్తంలో టెండర్లు పొందిన వారు పనులు చేయకుంటే అభివృద్ధి కుంటుపడే ప్రమాముందని వారు వాపోతున్నారు. నామినేషన్ పనులపై జీఓ జారీ చేస్తే గ్రామాల్లో చేపట్టే చిన్న చిన్న పనులు పూర్తవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సమస్యను రాజకీయ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో ఈ నెలాఖరులోగా నామినేషన్ల జీఓ జారీ అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పనుల కోసం రిజిస్ట్రేషన్లు...
రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టే అభివృద్ధి పనులన్నింటిని టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ తక్కువ మొత్తానికి చెందిన పనులు నామినేషన్లపై ఇస్తే కూడా రిజిస్ట్రేషన్ ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్ కాంట్రాక్టర్ అయితే నాణ్యత లోపిస్తే అతడిపై చర్యలు తీసుకోవచ్చన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పనులు పొం దేందుకు చిన్నచిన్న కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖలో అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
రిజిస్ట్రేషన్ల కోసం కాంట్రాక్టర్ల పోటీ
Published Wed, Nov 12 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement