సాక్షి, సంగారెడ్డి: కాలం పగబట్టింది.. దెబ్బమీద దెబ్బ తీస్తూ అన్నదాత నడ్డి విరుస్తోంది. కోటి ఆశలతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వానల్లేక నిలువునా ఎండిపోయి కర్షకులకు కన్నీళ్లే మిగిల్చాయి. నామమాత్రంగా పండిన మక్కలు, వడ్లను అమ్ముకుని తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టి కొంతలో కొంత ఉపశమనం పొందుదామనుకున్న పుడమి పుత్రుల ఆశలపై వాన దేవుడు నీళ్లు చల్లాడు. రెండు నెలలుగా ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా విజృంభించాడు.
దీంతో పంటలు కోసి ఆరబోసిన రైతులు.. ధాన్యాన్ని మార్కెట్లకు తరలించిన అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం కారణంగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న ధాన్యం నిల్వలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పొలాల్లోని వరి పంటలు నేలకొరిగాయి. జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవ ర్గాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపించింది.
మిగతా చోట్ల కూడా మోసర్తు వర్షం కురిసింది. సంగారెడ్డిలో సాయంత్రం రెండు గంటలపాటు జనజీవనం స్తంభించిపోయింది. జోగిపేట, నర్సాపూర్‌లోని మార్కెట్ యార్డుల వద్ద ఎండబోసిన మక్కలు, వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూస్తూ ఏమీ చేయలే క చేష్టలుడిగిన రైతులు కంటతడి పెట్టారు. మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కూడా వాన జల్లులు కురిశాయి.
వర్షార్పణం
Published Wed, Nov 12 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement