సాక్షి సంగారెడ్డి: వర్షాభావంతో జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. అదనుదాటడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు సగానికి పడిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 1.52 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. పొద్దుతిరుగుడు, ఆము దం పంటలను ప్రత్యామ్నాయ పంటలుగా రైతులకు సూచిస్తోంది.
వచ్చే ఆగస్టు చివరి వారం వరకు పొద్దుతిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పొద్దుతిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం పల్లెల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు వ్యవసాయశాఖ 15 ప్రచార రథాలను సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రచార రథాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా పంటల సాగు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
సాగుకు నోచుకోని1.89 లక్షల హెక్టార్లు
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత ఖరీఫ్‌లో 4.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంది. అయితే రైతులు ఇప్పటి వరకు 2.51 లక్షల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్న, పత్తి, వరి తదితర పంటలు సాగు చేయగలిగారు. వర్షాభావం వల్ల 1.89 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఖరీఫ్‌లో పంటల సాగు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఖరీఫ్‌లో 97,730
పత్తి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రైతులు 72,301 హెక్టార్లలో పత్తి సాగు చేయగలిగారు. 15,869 హెక్టార్లలో జొన్న సాగు చేయాల్సి ఉండగా 7,367 హెక్టార్లలో జొన్న వేశారు. 1,10,662 హెక్టార్లలో మొక్కజొన్న సాగు కావాల్సి ఉండగా 71,677 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న సాగు చేశారు.
గతంలో పోలిస్తే మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం ప్రస్తుత ఖరీఫ్‌లో సగానికి పడిపోయింది. వరి సాగు సైతం ఆశించిన స్థాయిలో లేదు. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 81,383 హెక్టార్లకుగాను 30వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వర్షాలు వచ్చేనెలలో సైతం ఆశించినస్థాయిలో కురవకపోతే పంటల ఎదుగుదల, సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా.
ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే ఆశలు
ఖరీఫ్‌లో వర్షాభావంతో రైతులు 1.89 లక్షల హెక్టార్లలో పంటలు వేయలేదు. దీంతో వ్యవసాయశాఖ 1.52 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. మిగతా 37వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సాగుచేయవచ్చని వ్యవసాయశాఖ అంచనా. ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి 1.15 లక్షల హెక్టార్లలో పొద్దతిరుగుడు, 37వేల హెక్టార్లలో ఆముదం సాగును వ్యవసాయశాఖ సూచిస్తోంది. 1.52 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు వీలుగా.. 5,733 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 1848 క్వింటాళ్ల ఆముదం విత్తనాలను సిద్ధం చేస్తోంది. పొద్దతిరుగుడు, ఆముదం పంటలు వచ్చేనెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చు. దీనిపై వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పించి వందశాతం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయించేందుకు సన్నద్ధమవుతోంది.
కమ్ముకున్న కరువు మేఘాలు
Published Sun, Jul 27 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement