సాక్షి, సిటీబ్యూరో: కూరగాయలు, పండ్లు..ఇతర నిత్యావసరాలు, ఔషధాలు..ఇలా ఒక్కటేమిటి..అన్నింటి కొనుగోలుకూ ఇప్పుడు గ్రేటర్ సిటీజన్లు డిజిటల్ బాట పట్టారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో..అగ్గిపుల్లా..సబ్బు బిల్లా అన్న తేడా లేకుండా మెజార్టీ నగరవాసులు బహిరంగ మార్కెట్‌లో నగదు రహిత లావాదేవీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరెన్సీ ఇచ్చిపుచ్చుకుంటే కరోనా పొంచి ఉందన్న భయంతో ఇప్పుడు అందరూ ఇదే బాట పట్టడం విశేషం. పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం నగదు రహిత లావాదేవీల్లో జాతీయస్థాయి సగటు 42 శాతం ఉండగా..నగరంలో కోవిడ్ కంటే ముందు (లాక్‌డౌన్‌కు ముందు)సుమారు 50 శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఈ చెల్లింపులు 70 శాతానికి చేరుకున్నాయని తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు నగదు రహిత చెల్లింపులు చేయని వారు సైతం ఈ బాట పట్టడం విశేషం. ఇక రోజువారీగా తాము చేసే కొనుగోళ్లకు సంబంధించి పేటీఎం వినియోగించే వారు 35 శాతం మందికాగా..గూగుల్ పే 25 శాతం..మరో 10 శాతం మంది ఫోన్‌పే, భీమ్ యాప్, అమెజాన్ మనీ తదితర డిజిటల్ మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కోవిడ్ భయమే కారణం...
కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో పలవురు సిటీజన్లు నగదు రహిత చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. పలు కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, రైతు బజార్లు, మిల్క్‌షాపులు, మెడికల్ షాపులు ఇలా ఎటు చూసినా నగదు ఇచ్చిపుచ్చుకునే కంటే పేటీఎం, గూగుల్ పేకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నోట్ల రద్దు పరిణామం అనంతరం పలు వాణిజ్య ప్రైవేటు బ్యాంకులు నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించడంతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరిగినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. నెట్ బ్యాంకింగ్ వినియోగించే వారితోపాటు బ్యాంకు కార్యాలయాలకు వచ్చే వారు సైతం..నెఫ్ట్, ఆర్టీజీఎస్ విధానాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, గృహిణులు, విద్యార్థులు చిరువ్యాపారులు అన్న తేడా లేకుండా ఇలాంటి లావాదేవీలు కొనసాగిస్తుండడం గమనార్హం.
ఏటీఎంలకు తగ్గిన రద్దీ...
‘డిజిటల్’ పేమెంట్స్ పుణ్యామా అని ఏటీఎం సెంటర్ల వద్ద రద్దీ పడిపోయిందనే చెప్పాలి. వేతనం పడడం ఆలస్యం..ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే అత్యవసర పరిస్థితిని డిజిటల్ పేమెంట్స్ యాప్స్ తప్పించాయనే చెప్పాలి. అత్యవసర పరిస్థితిలో తప్ప డబ్బులు డ్రా చేసేందుకు జనం దాదాపుగా స్వస్తి చెప్పారు. ప్రస్తుతం సిటీలో ఎక్కడ ఏటీఎం సెంటర్‌కు వెళ్ళినా సోషల్ డిస్టెన్స్ మాట అటుంచితే..ఖాళీగా దర్శనమివ్వడం చూడవచ్చు. డిజిటల్ పేమెంట్స్ పెరిగాక కొన్ని బ్యాంకులు అయితే ఏటీఎం సెంటర్లను తగ్గించినట్లుగా సమాచారం. కొన్ని ఏటీఎం సెంటర్లయితే పెద్ద నోట్లకే పరిమితమయ్యాయి.
సర్వాంతర్యామిగా మొబైల్..
నిన్నమొన్నటి వరకు అవతలి వారి మాటలను వినేందుకే ఉపయోగించిన మొబైల్ ఫోన్ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ‘అగ్రగామిగా’ నిలిచిపోతుంది. ఒకప్పుడు ఊర్లో వారికి డబ్బు డిపాజిట్ చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి చేయాల్సి వచ్చేది. రానురాను బ్యాంక్‌లో సొంత ఖాతాదారులకు మినహా వేరే ఖాతాదారుల అకౌంట్ నెంబర్‌కు డబ్బు డిపాజిట్ చేసే సేవలకు స్వస్తి చెప్పేశారు. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిపాజిట్ మిషన్లను అందుబాటులో ఉంచారు. రానురాను ఈ మిషన్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో డిజిటల్ లావాదేవీల వైపు ఖాతాదారులు మళ్లారు. ఇదేవిధమైన లావాదేవీలు ఇప్పుడు నిత్యావసరాలకు విస్తరించుకున్నారు. దీంతో వినియోగదారుల బాటే మా బాట అంటూ వ్యాపారులు సైతం డిజిటల్ క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేసుకుని డిజిటల్ పేమెంట్స్‌కు పచ్చ జెండా ఊపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment