సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా పాజిటివ్ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్ లింకులతో సంబంధం లేనివారిలో..నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారుల్లో కూడా కరోనా లక్షణాలు కన్పిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ కేసుల మూలాలు ట్రేస్‌కాక పోవడంతో ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితి ఏర్పడింది. కంటైన్మెంట్ జోన్ల ప్రకటన తర్వాత ఆయా జోన్లలో కొత్త కేసుల సంఖ్య కొంత వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ...ఇప్పటి వరకు గ్రీన్‌జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్‌లకు మినహా సెకండరీ, థర్డ్ కాంటాక్ట్‌లకు టెస్టులు నిలిపివేయడం,గ్రీన్‌జోన్ల పరిధిలో కొత్త్త కేసులు వెలుగు చూస్తుండటం..వాటి మూలాల గుర్తింపు వైద్య ఆరోగ్యశాఖకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ 27 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 540 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 151 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 18 మంది మృతి చెందగా, ప్రస్తుతం 371 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
♦ రామంతాపూర్‌లోని శ్రీరమణపురం చర్చికాలనికి చెందిన కిరాణా వ్యాపారి(53)కి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ద్వారా ఆయన భార్య(48)కి వైరస్ సోకింది. ఎవరి ద్వారా వీరికి వైరస్ సోకిందో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు.
♦ ముషీరాబాద్‌లోని ఓ మహిళకు ఈ నెల 14న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె ద్వారా కుమారునికి వైరస్ సోకింది. ఐదు రోజుల తర్వాత బేగంబజార్‌లో ఉన్న ఆమె కుమార్తెకు, మనవరాలికి, ఆ తర్వాత ఆమె సోదరునికి వైరస్ వ్యాపించింది. ఆమె వల్ల 50 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న సదురు మహిళలను చికిత్స కోసం బీదర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లోనూ తిప్పారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఎన్నారై, మర్కజ్ కేసులతో ఎలాంటి సంబంధాలు కూడా లేవు. కానీ ఆమెకు ఎలా వైరస్ సోకిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
♦ తాజాగా సోమవారం సరూర్‌నగర్ పోచమ్మ
టెంపుల్ వద్ద నివాసం ఉండే వ్యక్తి(50)కి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆయన మలక్‌పేట
గంజ్‌లో పల్లి నూనె వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఇటీవల వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో నివాసం ఉండే తన సోదరుని వద్దకు వచ్చి స్థానికంగా ఉన్న జీవన్‌సాయి ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందాడు. జ్వరం తగ్గకపోవడంతో యశోదా ఆసుపత్రికి, అక్కడి నుంచి మరోఆసుపత్రికి తరలించగా అతనికి కరోనాపాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోఆయన్ను గాంధీకి తరలించారు. చికిత్స చేసిన జీవన్‌సాయి ఆస్పత్రి డాక్టర్ సహా ఆయన సోదరుడు, బీఎన్‌రెడ్డినగర్‌లోని ఎస్‌కేడీనగర్‌లో ఉండే బావ కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. ఎవరి ద్వారా ఆయనకు వైరస్ సోకిందో తెలియక అధికారులు హైరానా పడుతున్నారు.
♦ బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీకి చెందిన కిరాణ వ్యాపారి(46)కి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన నుంచి కుమార్తె(15)కు మారుడు(13)లకు వైరస్‌సోకింది. నిజానికి వారిలో ఏ ఒక్కరికి కూడా ఎన్నారై, మర్కజ్ లింక్‌లతో ఎలాంటిసంబంధం లేదు. కానీ ఆయన కుటుంబంలో ముగ్గురు వైరస్ బారిన పడటం ఆందోళనకలిగిస్తోంది.
♦ కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి(24) ఓ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. జనతా కర్ఫ్యూ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. కానీ ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు వైరస్ ఎలా సోకిందో అధికారులకు సైతం అంతు చిక్కడం లేదు.
♦ కాలాపత్తర్‌కు చెందిన ఓ మహిళ(50) ఇటీవల కరోనాతో మృతి చెందింది. ఆమె ద్వారా భర్త సహా 11 మందికి వైరస్ సోకింది. వారం తర్వాత వారి దుకాణంలో పని చేసే వ్యక్తికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. సదరు మహిళ ద్వారా మొత్తం 15 మందికి వైరస్ సోకింది. నిజానికి ఆమెకు ఎన్నారై..మర్కజ్ లింకులు లేక పోయినా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment