‘గ్రేటర్‌’ అటెన్షన్‌! | Corona Positive Cases Increasing In GHMC Area | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’ అటెన్షన్‌!

Published Tue, Apr 14 2020 1:13 AM | Last Updated on Tue, Apr 14 2020 8:28 AM

Corona Positive Cases Increasing In GHMC Area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారే  ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్‌ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్‌ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత  పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్నివిధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, హైదరాబాద్‌తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలు, ధాన్యం కొనుగోళ్లపై సోమవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు.  

గ్రేటర్‌కు ముప్పు.. 
‘గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్‌ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. నగరాన్ని జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్‌ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్‌ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికంతా ఒక్కో డీఎంహెచ్‌వో ఉన్నారు. ఇప్పుడు జోన్లవారీగా వేర్వేరుగా సీనియర్‌ వైద్యాధికారిని నియమించాలి’అని సీఎం సూచించారు. 

కఠినంగా వ్యవహరించాల్సిందే.. 
‘పాజిటివ్‌ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్‌లోనే 126 కంటైన్మెంటు ప్రాంతాలు ఉన్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయొద్దు. బయటవారిని లోపలకు పోనీయొద్దు. ప్రతి కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్‌ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’అని సీఎం సూచించారు. అత్యధిక జన సమ్మర్థం ఉండే జీహెచ్‌ఎంసీలో పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండటాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని సీఎం అన్నారు. మున్సిపల్‌ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర సీనియర్‌ అధికారులు రోజూ ఉదయం ప్రగతిభవన్‌ లోనే జీహెచ్‌ఎంసీలోని సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్లు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement