వైరస్ సోకిన తరువాత దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తున్నా వైద్యం చేయించుకోకపోతే పొడిదగ్గు ఎంత తీవ్రమవుతుందంటే.. ఒక్కో దగ్గుకు మీ వెన్ను భాగం కలుక్కుమంటుంది. వైద్యులు పరీక్షలు జరిపి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారిస్తారు. ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు. సీటీ స్కాన్ చేస్తే.. ఊపిరితిత్తుల్లో ద్రవాలు అక్కడక్కడా పోగుబడి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు, వైరస్‌కు మధ్య యుద్ధం జరిగేది ఈ ద్రవాలు ఉన్నచోటే. ఇంకోలా చెప్పాలంటే ఈ దశలో కోవిడ్‌తోపాటు ప్రమాదకర స్థాయిలో న్యుమోనియా కూడా ఉందన్నమాట. వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స మొదలుపెడతారు. దీంతో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.
యాంటీ వైరల్ మందులు ఇస్తారు. వయసు మీరి ఉన్నా, మధుమేహం, గుండెజబ్బు వంటి ఆరోగ్య సమస్యలుంటే.. పరిస్థితి మెరుగుపడదు సరికదా, మరింత క్షీణిస్తుంది. రోజులపాటు వాంతులవుతాయి. గుండె కొట్టుకునే వేగం నిమిషానికి యాభైకి పడిపోతుంది. ఈ దశలో శరీర రోగ నిరోధక వ్యవస్థ సైటోకైన్స్‌ను విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. తెల్ల రక్త కణాలు ఊపిరితిత్తులపై దాడి చేస్తాయి. కణజాలం నశించిపోవడం, ద్రవాలు పేరుకుపోవడం ఎక్కువవుతుంది. దీంతో రక్తం నుంచి ఆక్సిజన్‌ను సేకరించే వ్యవస్థ నాశనమవుతుంది. తర్వాత ఒక్కో అవయవం పనిచేయడం ఆగిపోతుంది. కాలేయం పని చేయకపోతే రక్తంలోని విషాలు బయటకు వెళ్లవు. ఇంకోవైపు ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మెదడు కణాలు నశించిపోతుంటాయి. డాక్టర్ల మాటలు సగం సగమే వినపడుతుంటాయి. ఊపిరితిత్తులు, గుండె పని చేసేందుకు బయటి నుంచి యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని గంటల నరకయాతన తరువాత.. శ్వాశ ఆగిపోతుంది.
సబ్బుకు, వైరస్‌కు వైరమెందుకు
1. కరోనా వైరస్ పైపొర కొవ్వులు, ఇతర ప్రొటీన్లతో తయారై ఉంటుంది. మధ్యమధ్యలో కొన్ని ప్రొటీన్లు బయటకు పొడుచుకు వచ్చి ఉంటాయి. వీటిని స్పైక్ ప్రొటీన్లు అంటారు.
స్పైక్ ప్రొటీన్: వైరస్ లోపలికి ప్రవేశించేందుకు కారణమవుతుంది. ఇది కొవ్వులు, ఇతర ప్రొటీన్లతో కూడిన పై పొర.
2. సబ్బు అణువులు హైబ్రిడ్ నిర్మాణం కలిగి ఉంటాయి. తల భాగానికి నీటితో అతుక్కుపోయే గుణం ఉంటే, తోక భాగం నీటిని వికర్షిస్తూంటుంది.
హైడ్రోఫిలిక్ తల: నీటితో బంధం ఏర్పరచుకుంటుంది.
హైడ్రోఫోబిక్ తోక: నీటితో కాకుండా, నూనెలు, కొవ్వులతో బంధం ఏర్పరచుకుంటుంది.
3. చేతులు కడుక్కునే క్రమంలో సబ్బు అణువుల్లోని తోకలు వైరస్ పైపొర వైపు ఆకర్షితమవుతాయి. సూదుల్లాంటి నిర్మాణం ఉండటం వల్ల కొవ్వులతో తయారైన పై పొరకు కన్నాలు పడతాయి. ఫలితంగా వైరస్ లోపల ఉండే ఆర్‌ఎన్‌ఏ జన్యుపదార్థం బయటకు వస్తుంది. వ్యర్థాలతోపాటు వైరస్ తాలూకు ముక్కలు మిసిల్లే అని పిలిచే చిన్నచిన్న బుడగల్లా మారిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment