సాక్షి, హైదరాబాద్: స్కైల్యాబ్.. కరోనా.. గత నాలుగు దశాబ్దాల్లో జనాన్ని అత్యంత తీవ్రంగా వణికించిన సందర్భాలివే.. ఓ రకంగా చెప్పాలంటే రెండూ ఉపద్రవాలే.. ఒకటి అవగాహన లేని అమాయకత్వంతో జనం ఊహించి భయపడిందైతే, రెండోది నిజంగానే హడలగొడుతున్నది. ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జనాన్ని గడగడ వణికించిన సందర్భాలే.. ఇప్పుడు కరోనా ప్రభావం గడచిన నెలన్నరగా తీవ్ర భయాందోళనలను సృష్టిస్తుంటే, అప్పట్లో స్కైల్యాబ్ దాదాపు మూడు వారాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
జనాన్ని ఇంతగా భయాందోళనలకు గురి చేసిన వాటి జాబితా రూపొందిస్తే తొలి రెండు స్థానాల్లో ఇవే ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ తరహాలో సరిగ్గా వందేళ్ల క్రితం స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా విరుచుకుపడ్డా.. నాటి అనుభవాలను ప్రత్యక్షంగా చూసిన వారు ఇప్పుడు దాదాపు లేరు. అక్కడోఇక్కడో కొందరు ఉన్నా, నాటి ఉపద్రవం సమయంలో వారు చంటిపిల్లలై ఉంటారు. ఎవరో చెప్పింది వినటం తప్ప, స్వీయ అనుభవాలకు అవకాశం దాదాపు లేదు. ఇక నేటి తరంలో చాలా మంది ప్రత్యక్షంగా అనుభవించిన భయం.. అప్పట్లో స్కైల్యాబ్.. ఇప్పుడు కరోనానే..
స్కై ల్యాబ్: మానవ తప్పిదం సృష్టించిన భయం
నాసా రూపొందించిన ఆర్బిటర్ ఇది. కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ ల్యాబ్ జీవితకాలం ఏడేళ్లే. తర్వాత దీన్ని భూమిపైకి ఎలా తేవాలన్న విషయంలో నాసా సరిగ్గా వ్యవహరించలేదు. సాఫీగా తిరిగి వచ్చేలా సాంకేతిక ఏర్పాటు సరిగా జరగలేదనేది ఆరోపణ. ఈలోపే అది గతి తప్పడం మొదలైంది. 1978 చివరలో దీన్ని గుర్తించారు. చివరకు అది అతి వేగంగా వచ్చి భూమిని ఢీకొనటం తప్ప మార్గం లేదని అంతా భావించారు. అదే విషయం నాటి ప్రధాన ప్రసార మాధ్యమం అయిన రేడియో తేల్చి చెప్పింది. ఇంకేముంది జనంలో విపరీత భయాందోళనలు మొదలయ్యాయి. అది ఇండియా భూభాగాన్నే ఢీకొంటుందన్న ప్రచారం ప్రారంభమైంది. అదే సమయంలో పత్రికల్లో వెలువడ్డ ఓ వార్త తెలుగు నేలపై మరింత ఆందోళనను రాజేసింది.
తెలంగాణ భూభాగంలోని నిజామాబాద్ మొదలు ఏపీలోని సముద్ర తీరం వరకు ఎక్కడైనా పడే అవకాశం ఉందంటూ ఓ మ్యాప్ ప్రచురితమైంది. ఊరూరా పేపర్ వచ్చే రోజులు కానందున, ఆ నోటా ఈనోటా ఆ వార్త దావానలమైంది. అది నాసా ప్రయోగానికి సంబంధించిన ల్యాబ్ అన్న విషయంపై అవగాహన కొద్దిమందిలోనే ఉంది. నిరక్షరాస్యుల్లో చాలా మంది ఆకాశం నుంచి నక్షత్రం, భారీ గ్రహ శకలం లాంటిదేదో భూమిని ఢీకొనబోతోందని, దీంతో ప్రళయం ఏర్పడుతుందని, మనుషులంతా చనిపోతారన్న ప్రచారం ఎక్కువగా సాగింది. అప్పటికే అమెరికా నిపుణులు 1979 జూన్‌లో దాన్ని సముద్రంలో కూల్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియకున్నా, ఫలానా సమయంలో అది భూమిని ఢీకొంటుందన్న విషయం వెల్లడైంది.
పరిశోధనకు సంబంధించిందన్న సంగతి తెలియకున్నా, అది కూలే సమయం వివరాలు జనాల్లోకి చేరాయి. ఇంకేముంది, చావు దగ్గరపడిందని భావించి జనంలో విషాదం అలుముకొంది. దీంతో పనీపాట ఆపేసి బంధువులను ఇళ్లకు పిలిచి ‘చివరి మాటలు’చెప్పుకోవటానికి ప్రాధాన్యమిచ్చారు. శాఖాహారులైతే వీలైనన్ని పిండి వంటలు వండుకుని తినటం ప్రారంభించారు. పూటకొక్క తీరైన వంటకాలతో ఊళ్లకుఊళ్లను ఘుమఘుమలాడించారు. పెళ్లైన ఆడపిల్లలను ఇళ్లకు పిలిపించుకున్నారు. ఉన్న డబ్బులు ఖర్చు చేసి ‘పండుగ’చేసుకున్నారు. ఇక మాంసాహారులైతే ఇళ్లలో ఉన్న మేకలు, కోళ్లను ఖతం చేసేశారు. అందుబాటులో ఉన్న మద్యాన్ని తాగేసి ఒకరినొకరు పట్టుకుని ఏడ్వటం మొదలుపెట్టారు. అలా ఓ మూడు వారాలు అదే పద్ధతిలో గడిపేశారు.
రేడియో వార్తల కోసం..
ఊరూరికి వార్తా పత్రికలు వచ్చే రోజులు కానందున, రేడియో ఉన్న వారిళ్లకు క్యూ కట్టేవారు. సరిగ్గా వార్తల వేళ ఊరు కదిలివచ్చేది. అందులో స్కైల్యాబ్ గురించి చెప్తారని ఎదురు చూసేవారు. చివరకు జూన్‌లో శాస్త్రజ్ఞులు దాన్ని విజయవంతంగా సముద్రంలో కూల్చేశారు. కొన్ని శకలాలు మాత్రం భూమి మీద పడ్డాయి, అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై కావటం విశేషం. భారత్‌కు ప్రమాదం తప్పింది. ఈ విషయం రేడియో ద్వారా తెలుసుకుని సంతోషంతో పండుగలు చేసుకున్నారు. మూడు వారాల పాటు ఆపేసిన పనులకు తిరిగి శ్రీకారం చుట్టారు.
కరోనా: వైరస్ సృష్టిస్తున్న బీభత్సం
గడచిన నెలన్నరగా ఒకటే భయం. ఎప్పుడు కరోనా వైరస్ విరుచుకుపడుతుందోనన్న ఆందోళన. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినందున జనం ఇళ్లకే పరిమితమయ్యారు. గత కొన్ని దశాబ్దాలు కొన్ని విపత్తులు ఏర్పడ్డా, అవి ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అన్ని ప్రాంతాలు వాటి బారిన పడ్డ దాఖలాలు లేవు. అప్పట్లో స్కైల్యాబ్ భయం అన్ని ప్రాంతాలను వణికించగా, ఆ తర్వాత అదే తరహాలో తీవ్ర భయాందోళనలు అన్ని చోట్లా కనిపించటం ఇప్పుడే. స్కైల్యాబ్ తరహాలో కరోనా వణుకుపుట్టిస్తోంది. అప్పట్లో ఎలాంటి నష్టం వాటిల్లకున్నా.. మానవ వినాశనమే అన్న భయంతో అల్లాడిపోయారు. కంటిమీద కునుకు లేకుండా గడిపారు. కానీ ఇప్పుడు కరోనా కళ్ల ముందు ప్రభావాన్ని చూపుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతోంది.
అప్పుడూ ఇప్పుడూ బ్రహ్మంగారి మాటలే వైరల్
తూర్పు దిక్కున కోరంకి వ్యాధి పుట్టి కోటి మంది చస్తారయా.. అంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారన్న ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మారణహోమం సృష్టిస్తున్న కరోనా వైరసే ఆ కోరంకి అంటూ సామాజిక మాధ్యమాల్లో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇదే తరహాలో స్కైల్యాబ్ పడుతుందన్నప్పుడు కూడా కాలజ్ఞాన ప్రచారం జరిగింది. కలియుగాంతం దగ్గరపడిందని, ఆ విషయాన్ని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని, ఆ ప్రళయం స్కైల్యాబ్ రూపంలో వస్తోందంటూ ఊరూరా ప్రచారం జరిగింది. పల్లెల్లో రాత్రి వేళ బ్రహ్మంగారి మాటగా ఆటపాటలతో ప్రచారం చేసిన వారూ ఉన్నారు.
ఉద్యోగులను హెలికాప్టర్లలో రక్షిస్తారట!
‘స్కైల్యాబ్ వార్త తెలిసినప్పటి నుంచి నిత్యం సాయంత్రం వేళ మా ఇంటివద్ద జన సమూహం ఏర్పడేది. నా వద్ద ఉన్న రేడియోలో వార్తలు వినేందుకు వచ్చేవారు. స్కైల్యాబ్ కూలటానికి రెండ్రోజుల ముందు.. అది ప్రకృతి ఉపద్రవం కాదని, అంతరిక్ష పరిశోధన శాల అని, సాంకేతిక సమస్యతో కూలిపోతోందని తెలిసింది. ఇక మరుసటి రోజు, స్కైల్యాబ్‌ను సముద్రంలో కూల్చేస్తారన్న వార్త రేడియోలో ప్రసారమైంది. అయినా జనంలో భయం పోలేదు. ఆ సమయంలో ఓ వింత వదంతి వ్యాపించింది. ప్రభుత్వ ఉద్యోగులను హెలికాప్టర్‌ల ద్వారా రక్షిస్తారని, సాధారణ రైతులు చనిపోతారన్నది దాని సారాంశం. దీంతో ఆ రాత్రంతా కొందరు రైతులు నేను ప్రభుత్వ ఉద్యోగినైనందున నాతోనే గడిపారు. నా కోసం వచ్చే హెలికాప్టర్‌లో వారూ రావచ్చన్నది వారి ఉద్దేశం. చివరకు అదిసముద్రంలో కూలిందన్న వార్త రేడియోలో విన్నాక జనం ఊపిరిపీల్చుకున్నారు.’
– హరగోపాల్,విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆలేరు
పశువులను దాచేశారు...
‘యావత్తు తెలంగాణ స్కైల్యాబ్ బారిన పడుతుందన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. దీంతో చదువుకున్న వాళ్లు, చదువు లేనివాళ్లు అన్న తేడా లేకుండా ఆందోళనకు గురయ్యారు. తమకున్న మేకలు, కోళ్లను వండుకుని తినగా, పశువులను చాలా మంది దాచేశారు. మైదాన ప్రాంతల కంటే ఇళ్లలో ఉండటం కొంతలోకొంత సురక్షితమన్న భావనతో చాలామంది తమ పశువులను ఇళ్లలో దాచేశారు. అవి బయటకు రాకుండా బంధించేశారు. చోటు సరిపోక ఊపిరాడక అలా వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి.’
– రంగాచార్యులు,విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, హన్మకొండ
Comments
Please login to add a commentAdd a comment