తెలంగాణలో మరణాల రేటు రెట్టింపు  | Coronavirus attacking young people In India | Sakshi
Sakshi News home page

యువకులపై పంజా

Published Thu, Apr 2 2020 2:19 AM | Last Updated on Thu, Apr 2 2020 12:28 PM

Coronavirus attacking young people In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో యువకులపై కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపైనే తన ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటి వివరాలు ట్రాక్‌ చేస్తున్న ‘కరోనా ట్రాకర్‌’అనే వెబ్‌సైట్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,751 కేసులు నమోదు కాగా.. 614 కేసులను విశ్లేషించింది. మిగిలిన కేసులకు సంబంధించిన వయసు, తదితర వివరాలు సమగ్రంగా లేకపోవడంతో 614 కేసులనే విశ్లేషించగలిగింది. (కరోనా :అపోహలూ... వాస్తవాలు)

ఈ కేసుల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 157 మంది ఉన్నారని తేల్చింది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 129 మంది ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు 97, 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు 96 మంది ఉన్నారు. 60 నుంచి 70 మధ్య వయసు వారు 72 మంది ఉన్నారని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. అత్యంత తక్కువగా 80 నుంచి 100 ఏళ్ల మధ్య వయసు వారు ఏడుగురు కాగా, 10 ఏళ్లలోపు వారు 15 మంది ఉన్నారు. 70 నుంచి 80 ఏళ్ల వయసు వారు 18 మంది ఉన్నారు. 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారు 23 మంది ఉన్నారు. అంటే అత్యంత ఎక్కువగా యుక్త వయస్కులకే కరోనా వ్యాపించిందని వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే మరణాలు ఏ వయసు వారిలో ఎక్కువ ఉన్నాయన్న దానిపై విశ్లేషించలేదు. అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం 70 ఏళ్లు దాటినవారే అధికంగా మరణిస్తున్నారని తెలిపింది. (బీసీజీ వ్యాక్సిన్తో కరోనా నుంచి రక్షణ? )

నెల రోజుల్లో భారీగా పెరిగిన కేసులు.. 
దేశంలో కేసుల సంఖ్య నెల రోజుల్లో అనేక రెట్లు పెరిగాయని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 1 నాటికి ఎన్ని కేసులు పెరిగాయో తెలిపింది. మార్చి 1 నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఆ సంఖ్య మార్చి 10వ తేదీ నాటికి ఏకంగా 48కు చేరాయి. మార్చి 20 నాటికి 199కి చేరాయి. మార్చి 31 నాటికి 1,619 కాగా, బుధవారం సాయంత్రానికి (ఏప్రిల్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు) ఆ సంఖ్య 1,751కు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 325 కేసులు నమోదు కాగా, 12 మంది చనిపోయారు. 39 మంది కోలుకున్నారు. (మేం క్షేమం.. మరి మీరు?)

ఆ తర్వాత కేరళలో 241 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో 24 మంది కోలుకోగా, ఇద్దరు చనిపోయారు. తమిళనాడులో 124 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఆరుగురు కోలుకున్నారు. ఒకరు చనిపోయారు. ఢిల్లీలో 123 మందికి కరోనా వైరస్‌ సోకగా, ఆరుగురు కోలుకున్నారు.. ఇద్దరు చనిపోయారు. రాజస్థాన్‌లో 106 మందికి పాజిటివ్‌ రాగా, ముగ్గురు కోలుకున్నారు. ఎవరూ చనిపోలేదు. కర్ణాటకలో 105 మందికి పాజిటివ్‌ రాగా, 9 మంది కోలుకున్నారు.. ఇద్దరు చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో 104 మందికి పాజిటివ్‌ రాగా, 17 మంది కోలుకున్నారు.. ఒకరు చనిపోయారు. తెలంగాణలో 97 మందికి పాజిటివ్‌ రాగా, 14 మంది కోలుకున్నారు. ఆరుగురు చనిపోయారని వెబ్‌సైట్‌ నివేదిక తెలిపింది.  

తెలంగాణలో మరణాల రేటు రెట్టింపు 
దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,751 కాగా, వారిలో 53 మంది చనిపోయారని వెబ్‌సైట్‌ తెలిపింది. అంటే దేశంలో మరణాల రేటు 3.03 శాతంగా ఉన్నట్లు తేల్చింది. తెలంగాణలో 97 మందికి కరోనా సోకగా, వారిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. అంటే దేశవ్యాప్త కరోనా మరణాల రేటు కంటే రాష్ట్రంలో దాదాపు రెట్టింపు.. అంటే ఆరు శాతం కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్నవారు దేశంలో 155 మంది ఉన్నారు. అంటే రికవరీ రేటు 8.85 శాతం ఉన్నట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. ( నలుగురు మృతుల నుంచి మరెంత మందికో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement