గ్రేటర్‌లో మళ్లీ కరోనా అలజడి.. | Coronavirus Cases Rising In GHMC Area | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో మళ్లీ కరోనా అలజడి..

Published Sun, May 17 2020 8:37 AM | Last Updated on Sun, May 17 2020 2:02 PM

Coronavirus Cases Rising In GHMC Area - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా కరోనా బాధితులు పెరగడంతో పాటు కంటైన్మెంట్ల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 60కిపైగా కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. వీటిలో శనివారం నాటికి ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలోనే 50కిపైగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు వ్యక్తిగత నివాసాల్లో ఉండేవారికే కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కేవలం వ్యక్తిగత నివాసాలకే కంటైన్మెంట్‌ పరిమితం చేశారు. తాజాగా అపార్ట్‌మెంట్‌ వాసుల్లోనే వైరస్‌ వెలుగు చూస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా అదే భవనంలోని 50 నుంచి 100 కుటుంబా లు చిక్కుల్లో పడాల్సివస్తోంది.

ఇటీవల గడ్డిఅన్నారం తిరుమలానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి ద్వారా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనం ఉంటున్న వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా మాదన్నపేటలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 23 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో 50 కుటుంబాల వరకు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అధికారులు అపార్ట్‌మెంట్‌ను మొత్తం కంటైన్మెంట్‌గా ప్రకటించి, రాకపోకలను నిషేధించారు. మోతీనగర్‌ డివిజన్‌లో ఒకటి, అల్వాల్‌ కాణాజిగూడలో మరొకరికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్లుగా ప్రకటించారు.  (లాక్‌డౌన్‌లో రక్తమోడుతున్న రోడ్లు)

ఆ మూడు సెంటర్లలో 26 పాజిటివ్‌ కేసులు 
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి కార్వంటైన్‌లో ఉన్న అనుమానితుల్లో 11 మందికి నెగిటివ్‌ రావడంతో  శనివారం వారిని డిశ్చార్జి చేశారు. తాజాగా ఐదు అనుమానిత కేసులు నమోదు కాగా, ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  
ఆయుర్వేద ఆస్పత్రిలో 120 మంది ఉండగా, వీరిలో 20 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నెగిటీవ్‌ వచ్చిన 60 మందిని డిశ్చార్జి చేశారు. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది.  
కింగ్‌కోఠి ఆస్పత్రి ఓపీకి శనివారం 75 మంది రాగా, వీరిలో నలుగురిని అడ్మిట్‌ చేశారు. 18 మంది నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. శుక్రవారం పంపిన నమూనాల్లో ఐదు పాజిటివ్‌ రాగా.. ఆరు నెగిటివ్‌ వచ్చాయి. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్‌లో 40 మంది అనుమానితులు ఉన్నారు. కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన ఐదుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  
నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి తాజాగా మరో ఐదు అనుమానితులు వచ్చారు. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు.     

జియాగూడలో పరిధిలో..  
జియాగూడ పరిధిలోని సబ్జిమండి, మేకలమండి వైరస్‌కు ప్రధాన వాహకాలుగా తేలాయి.   సాయిదుర్గానగర్,  దుర్గానగర్, వెంకటేశ్వరనగర్‌ బస్తీవాసులు ఈ మార్కెట్లపై ఆధారపడి జీవిస్తు న్నారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు ఇక్కడ 11 మంది ఉన్నారు. వీరి ద్వారా వైరస్‌ ఇతరులకు విస్తరించింది. జియాగూడ పరిధిలో ఇప్పటి వరకు 88 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. , వీరిలో ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందారు. ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో 20 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా, వీటిలో ఒక్క జియాగూడ డివిజన్‌లోనే 8 కంటైన్మెంట్లు ఉండటం విశేషం. ఇదే ప్రాంతానికి ఆనుకుని ఉన్న జుమ్మేరాత్‌బజార్‌ పరిధిలోని జుంగూర్‌బస్తీలో ఒక వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన 30 మందిని క్వారంటైన్‌ చేశారు. ఇక మంగళ్‌హాట్‌ కామటిపురకు చెందిన ఓ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ద్వారా మరో 15 మందికి వైరస్‌ విస్తరించింది.  కుల్సుంపుర పీఎస్‌ పరిధిలోని ఓ కానిస్టేబుల్‌ (33)కు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఆయన కుటుంబం వనస్థలిపురంలో ఉంటోంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సహా అటూఇటుగా ఉన్నవారందరినీ క్వారంటైన్‌ చేశారు. ఆసిఫ్‌నగర్‌లో 50పైగా కేసులు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 

ఎల్బీనగర్‌లో..  
ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలో ఐదు సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు ఇక్కడ 57కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు వనస్థలిపురం కాంప్లెక్స్, ఎస్‌కేడీ నగర్, హుడాసాయి నగర్‌ కాలనీ, జేబీకాలనీ, తిరుమలానగర్, శారదానగర్‌లలోనే నమోదు కావడం ఆం దోళన కలిస్తోంది. దీంతో 13 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ఏర్పాటు చేశారు. మలక్‌పేట గంజ్, పండ్లమార్కెట్, కూరగాయల మార్కెట్లతో పాటు మలక్‌పేటలోని ఓ డయాలసిస్‌ కేంద్రం ద్వారా వైరస్‌ ఎక్కువ మందికి విస్తరించింది. ఇక్కడ డయాలసిస్‌ చేయించుకున్న ముగ్గురు మృతి చెందారు. గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల

సంఖ్య తగ్గినట్టే కన్పిస్తున్నప్పటికీ.. ఇప్పటికే పాజిటివ్‌ 
వచ్చిన వారి ద్వారా మరెంత మందికి వైరస్‌ సోకిందనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఇక్కడ కొత్త కేసుల ట్రేసింగ్‌ తగ్గుముఖం పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అంబర్‌పేట్‌ చెన్నారెడ్డినగర్‌ ఇప్పటి వరకు 13 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇక్కడ ఇప్ప టికే ఇద్దరు మృతి చెందారు. మిగిలిన వారు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. పాజిటివ్‌ కేసులు నమోదైన ఇంటితో పాటు అటూ ఇటుగా ఉన్న కుటుంబాలను కలిపి కంటైన్మెంట్‌గా ప్రకటించారు.  
(కిడ్నాపైన బాలుడికి కరోనా పాజిటివ్‌)

మీర్‌పేటలో..  
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కరోనా వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఒకే ఇంట్లో ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న మీర్‌పేట సిర్లాహిల్స్‌ కాలనీకి చెందిన ఓ మహిళ ద్వారా ఆమె భర్త, ఇద్దరు కుమారులు, న్యూవివేక్‌నగర్‌లో ఉండే ఆమె కుమార్తె, అల్లుడు, మనవడు (9 నెలలు) సోకి నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె నివాసం ఉంటున్న సిర్లాహిల్స్‌కాలనీ, న్యూవివేక్‌నగర్‌లోని సుమారు వంద కుటుంబాలను కంటైన్మెంట్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.  

ఆసిఫ్‌నగర్‌లో మరో 10 మందికి వైరస్‌.. 
విజయనగర్‌కాలనీ : ఆసిఫ్‌నగర్‌లో శనివారం మరో 10 మందిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. న్యూకిషన్‌నగర్‌లో 10 రోజుల క్రితం ఓ ఆటోడ్రైవర్‌ (56)కు వైరస్‌ సోకింది. అతని ద్వారా కుటుంబ సభ్యులకు ఆరుగురికి కరోనా అంటుకుంది. ఇంటి పరిసరాల్లో క్వారంటైన్‌లో ఉన్న మరో 10 మందికి శనివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ష్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 67 మందికి కరోనా వ్యాధి సోకగా ఇందులో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

గోషామహల్‌లో 9 కేసులు.. 
గోల్కొండ : గోషామహల్‌ పరిధిలో శనివారం 9 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. కామాటిపురాలో ఒకే భవనంలో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ధూల్‌పేట శివ్‌లాల్‌నగర్‌లో మరో కరోనా పాజిటివ్‌ వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే కార్మికురాలు (60)కు కరోనా రావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇంట్లో ఉండే 21 మందిని క్వారంటైన్‌కు పంపించారు.   

కామన్‌ టాయ్‌లెటే కొంప ముంచిందా..?  
ఒకే భవనంలో ఉండే వారంతా ఒకే టాయ్‌లెట్‌ వాడటంతోనే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఇదే ఇంట్లో కిరాయికి ఉండే ఓ వ్యక్తికి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రాగా ఆ భవనంలో అద్దెకు ఉండే 62 కిరాయిదారులను పోలీసులు, ఇతర అధికారులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు చేయగా శుక్రవారం 15 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. శనివారం అదే భవనంలో అద్దెకు ఉండే మరో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అద్దెదారులంతా కామన్‌ టాయ్‌లెట్‌ వాడడంతోనే వీరికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement