సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ వినియోగంపై కరోనా ఎఫెక్ట్ పడింది. రెండు మూడు రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుత సగటు విద్యుత్ వినియోగం తగ్గింది. నగరంలో చాపకింది నీరులా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లకు సెలవు ప్రకటించడంతో పాటు క్లబ్బులు, పబ్బులు, బార్లు, మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు మూసివేసిసిన విషయం తెలిసిందే. అంతేకాదు సభలు, సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లను కూడా వాయిదా వేసుకోవాల్సిం దిగా ప్రకటించింది. ప్రజల్లో తీవ్ర భయాందోళనతో ఇంటి నుంచి బయటికి కూడా రావడం లేదు. హోటళ్లు, వాణిజ్య సంస్థలు కూడా మూతపడ్డాయి.
పలు ఐటీ అనుబంధ సంస్థలు తమ ఉద్యోగులకు హోం టూ వర్క్ ఆర్డర్స్ జారీ చేశాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలతో పోలిస్తే శీతల ప్రదేశాల్లో వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉండటంతో వాణిజ్య సంస్థల్లోనే కాదు గృహాల్లోనూ ఏసీల వినియోగం తగ్గించారు. ఫలితంగా రోజూవారీ సగటు విద్యు త్ వినియోగం తగ్గుముఖం పట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ నెల 13న అత్యధికంగా 52.65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ...అదే 15 వ తేదీన 46.53 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. కేవలం గృహ వినియోగం మాత్రమే కాదు పారిశ్రామిక వినియోగం కూడా భారీగా తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. విదేశాలకు ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడం, చైనా సహా పలు దేశాల నుంచి రావాల్సిన ముడిసరుకు దిగుమతి కాకపోవడంతో ఆయా సంస్థలు యూనిట్లను షట్‌డౌన్ చేశాయి. విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టడానికి పరిశ్రమల్లోని పలు యంత్రాలు పని చేయక పోవడమే ప్రధాన కారణమని డిస్కం ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment