సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిపై కలకలం రేగుతోంది. సర్కారు వెల్లడించిన లెక్కల ప్రకారమే బాధితుడు 80 మందిని కలిసినట్టు తేలింది. అయితే వారు ఎంతమందిని కలిసి ఉంటారో అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. కోవిడ్ సోకినట్టు తేలిన వ్యక్తి గతనెల 22న బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్ వచ్చాడు. ఆ బస్సులో అతడితోపాటు ప్రయాణించిన 27 మంది ఇప్పటికే వందల మందిని కలిసి ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే బాధితుడు హైదరాబాద్‌లో 9 రోజులపాటు తిరిగాడు. అతడు చికిత్స చేయించుకున్న అపోలో ఆస్పత్రిలో 23 మందిని గుర్తించారు. వీరు కాకుండా అతడు ఇంకా ఎవరెవరిని కలిశాడు అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అందరినీ ట్రేస్ చేయడం కష్టసాధ్యమని చెబుతున్నారు. బాధితుడు ఎక్కువ మందిని కలవడం అధికారులను కలవరపెడుతోంది. బాధితుడు నేరుగా కలిసిన వారికి మాత్రమే వైరస్ విస్తరించే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇందులోనూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లలకు వైరస్ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఇతర దేశాల నుంచి వచ్చి.. జలుబు, దగ్గుతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చినవారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని ప్రైవేటు హాస్పిటళ్లకు సూచించినట్టు ఆరోగ్యశాఖ చెబుతుం డగా, ఆ ప్రకారం వారు వ్యవహరించడంలేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్ సోకిన యువకుడికి నిపుణులైన డాక్టర్లు, శిక్షణ పొందిన నర్సులు చికిత్స అందిస్తున్నారు. కేరళలో ఈ వైరస్ సోకిన ముగ్గురు వ్యక్తులకు అక్కడి వైద్యులు చేసిన చికిత్సతో పూర్తిగా నయమైంది. దీంతో గాంధీ ఆస్పత్రిలో ఉన్న బాధితుడికి ఇవ్వాల్సిన చికిత్సపై కేరళ డాక్టర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంప్రదించింది. అలాగే కోవిడ్ బాధితులకు చేయాల్సిన చికిత్సా విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. కోవిడ్ కూడా స్వైన్‌ఫ్లూ తరహాలోనే శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో ఫ్లూ నివారణకు అనుసరించే విధానంలోనే ఈ బాధితుడికి చికిత్స చేయనున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఇవీ కోవిడ్ లక్షణాలు...
జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కోవిడ్ సాధారణ లక్షణాలు. గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20% కేసులలో కనిపిస్తాయి. చైనా వైద్య ఆరోగ్యశాఖ అంచ నా ప్రకారం ఇటువంటి లక్షణాల్లో 81% కేసులు తేలికపాటివి, 14 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఉం టుంది. 5 శాతం మందికి వెంటిలేటర్ లేదా క్లిష్టమైన సంరక్షణ నిర్వహణ చర్యలు అవసరం. కోవిడ్ లక్షణాలు 2 నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. శ్వాసకోశ స్రావాల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే బిందువుల ద్వారా .. కలుషితమైన వస్తువులు, దగ్గరి పరిచయాల ద్వారా పరోక్షంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment