సాక్షి, సిటీబ్యూరో: ‘పోలీసు సిబ్బందికి షిఫ్ట్‌లు..ప్రతి వారం వీక్లీ ఆఫ్‌లు’ – ఏళ్లుగా వినిపిస్తున్న ఈ మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆ ప్రభావం ప్రస్తుతం నెలకొన్న ‘కరోనా ఫీవర్’పై తీవ్రంగా కనిపిస్తోంది. ఆరోగ్యవంతుల కంటే ఊబకాయం సహా ఇతర రుగ్మతలతో కూడిన వారికి కరోనాతో ముప్పు ఎక్కువని నిపుణులు, వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నమరణాలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేనని స్పష్టమవుతోంది. పోలీసు విభాగాన్ని తీసుకుంటే గరిష్టంగా 30 శాతం మంది పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండరు. అనేక మందికి ఊబకాయం, షుగర్, బీపీ, శ్వాసకోస సమస్యలు, హృద్రోగం తదితరాలలో ఇబ్బంది పడుతున్న వారే. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు విభాగాన్ని కరోనా వైరస్ చుట్టేస్తుండటం పోలీసులతో పాటు వారి కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం నాటికి సిటీ పోలీసు విభాగంలో పాజిటివ్ కేసుల సంఖ్య 125 దాటింది. ఇప్పటి కరోనా పరిస్థితులు పక్కన పెట్టినా...పోలీసు సిబ్బందిలో ఈ రకమైన అనారోగ్యకర పరిస్థితి నెలకొనడానికి అనేక కారణాలున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖలతో పోలిస్తే ఫిట్‌నెస్ అనేది పోలీసు వారికి అత్యంత కీలకమైన అంశం. ఎంపిక, శిక్షణ, విధి నిర్వహణ ఇలా అన్ని స్థాయిల్లోనూ ఇది పరిగణలోకి తీసుకుంటారు. ఎంపిక, శిక్షణ దశల్లో ఉన్న దారుఢ్యం ప్రస్తుతం 15 శాతం మందిలోనూ కనిపించట్లేదు. అప్పట్లో ఉన్న శ్రద్ధ, సమయం లేకపోవడంతో పాటు పనితీరు కూడా దీనికి దోహదం చేస్తోంది.
30 శాతం మందికీ వర్తించని బీఎంఐ...
ఎంత ఎత్తు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉండాలనే దానికి సంబంధించి అంతర్జాతీయ గణన ఉంది. దీన్నే సాంకేతికంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటారు. పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా దరఖాస్తు చేసుకునే వారు పురుషులైతే కనిష్టంగా 167.6 సెంమీ, మహిళలైతే 152.5 సెంమీ ఎత్తు ఉండాలి. (రిజర్వేషన్ ప్రకారం కొందరికి మినహాయింపులు ఉంటాయి.) దీని ప్రకారం చూస్తే 58.3–68.2 కేజీల మధ్య మాత్రమే బరువు కలిగి ఉండాలి. ఎంపికయ్యే వారి గరిష్ట ఎత్తు 182.8 సెంమీ (ఆరు అడుగులు) అనుకున్నా... 63.6–79.5 కేజీల మధ్య మాత్రమే ఉండటం బీఎంఐ ప్రకారం తప్పనిసరి. అయితే ప్రస్తుం నగర కమిషరేట్ పరిధిలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో కనిష్టంగా 30 శాతం మంది కూడా బీఎంఐ ప్రకారం ఎత్తుకు తగ్గ బరువుతో ఫిట్‌గా ఉండరన్నది అధికారులే అంగీకరిస్తున్నా వాస్తవం. 60 శాతం మంది అధిక బరువు, మరో పది శాతం మంది ఒబేసిటీతో బాధపడుతుంటారని వారే చెప్తున్నారు. ఈ కారణంగానే అనేక మంది వివిధ రకాలైన రుగ్మతల పాలవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ స్థితికి కారణాలు అనేకం...
పోలీసు ఉద్యోగం కోసం ఎంపికయ్యే, శిక్షణలో ఉన్నప్పుడు తీసుకున్నంత ఆరోగ్య శ్రద్ధ విధుల్లో చేరిన తరవాత తీసుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క సమయం, సందర్భం లేకుండా బందోబస్తు, ఇతర విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆహారం, నిద్ర సరైన సమయానికి సాధ్యం కావు. అన్ని రోజుల్లోనూ ఒకే సమయంలో తీసుకోవడం కూడా అసంభవమే. ఇది పొట్ట, ఊబకాయం పెరగడంతో పాటు అనేక ఇతర రుగ్మతలకూ మూలంగా మారుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇబ్బందులతో పాటు మహిళా సిబ్బంది విషయంలో మరికొన్ని కారణాలతో ఊబకాయం సమస్యకు లోనవుతున్నారు. పురుష కానిస్టేబుళ్లతో పోలిస్తే మహిళా కానిస్టేబుళ్లతోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని పోలీసులే చెప్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే సిబ్బంది అనునిత్యం కాలుష్యం, దుమ్ము–ధూళి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఈ కారణంగానే వీరికి శ్వాసకోస సంబంధ వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి.
బందోబస్తులు మరో ‘భారం’
సిటీలో పని చేసే సిబ్బంది బందోబస్తులతో మరింత ‘భారం’గా మారుతున్నారు. నగరంలో పని చేసే వారిలో సగం కంటే ఎక్కువ మంది దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు ఈ విధుల్లో గడపాల్సిందే. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే ఒకే ప్రాంతంలో గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువగా బయట తయారు చేసి, నూనె ఉత్పత్తులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. ఈ కారణంగానే సిబ్బంది తమ బరువుపై అదుపు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటికీ మించి ఇతర విభాగాలతో పోలిస్తే పోలీసులు చాలా తొందరగా, తేలిగ్గా దురలవాట్లకు బానిసలు అవుతుండటం కూడా ఒబెసిటీకి మరో కారణంగా కనిపిస్తోంది.
అప్పటిలా కనిపించని డ్రిల్స్...
పోలీసు విభాగంలో పని చేసే సిబ్బంది కచ్చితంగా ఫిట్‌నెస్‌తో ఉండాలన్న ఉద్దేశంతో డ్రిల్స్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఇవి పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారికీ ప్రతి వారం జరిగేవి. ఇందులో భాగంగా దాదాపు మూడునాలుగు గంటల పాటు వ్యాయామం, ఇతర కసరత్తులు చేయించే వారు. అయితే ప్రస్తుతం బందోబస్తులు, ఇతర పనులకే సమయం చాలకపోవడంతో డ్రిల్స్ మూలనపడ్డాయి. ఎవరికి వారూ సొంతంగా చేసుకోవడానికీ అవకాశం చిక్కట్లేదు. మిలటరీ విభాగాల్లో ఉన్నట్లు పోలీసు సిబ్బందికి నిత్యం ఫిట్‌నెస్ పరీక్షలు, వ్యాయామాలు లేకపోవడం, ఉన్నతాధికారుల మాదిరి మిడ్ కెరియర్ శిక్షణలు కరవు కావడం వీరికి శాపంగా మారుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవలే పోలీసుస్టేషన్లలో జిమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని వినియోగించుకునే సమయం సిబ్బందికి దొరకట్లేదు.
షిఫ్ట్, వీక్లీ ఆఫ్ అమలు చేయాలి
‘ప్రస్తుతం సిటీలో రోజు రోజుకూ కరొన కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఆంక్షలు, కఠిన నిబంధనలు ప్రవేశపెట్టాలన్నా పోలీసుల సహకారం అత్యంత కీలకం. అయితే పోలీసు విభాగం అలాంటి పరీక్షల్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా లేదు. సమయ పాలనతో పాటు సరైన నిద్ర, ఆహారం లేని విధులు నిర్వర్తించే పోలీసుల్లో ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా మారుతోంది. ముందుగా సిబ్బంది సంఖ్యను పెంచి, షిఫ్ట్ డ్యూటీలు, వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాలి. ప్రధానంగా ప్రతి పోలీసులకూ కేవలం ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ టైమ్‌గా స్పష్టం చేసి, అమలు చేయాలి. అలా చేస్తేనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళనూ పోలీసు విభాగం సమర్థంగా ఎదుర్కోగలదు’.– పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment