సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అధికారులు, సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు సరఫరా చేస్తున్నారు. సిటీలో ఉన్న పోలీసు క్లినిక్స్ ద్వారా, వైద్యుల పర్యవేక్షణలో వీటిని సిబ్బందికి అందిస్తున్నారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన నాటి నుంచి పోలీసు అధికారులు అనునిత్యం విధులకు అంకితమయ్యారు. దీంతో అనేక మంది లక్షణాలు బయటపడని ‘పాజిటివ్ వ్యక్తులతో’ కాంటాక్ట్‌లోకి వెళ్లి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రి వద్ద విధులు నిర్వర్తించిన సిబ్బందితో పాటు కోవిడ్ హాట్‌స్పాట్స్‌గా మారిన ప్రాంతాల్లో నివసించే, అక్కడ పని చేసిన వారు, కంటైన్మెంట్ జోన్లలో డ్యూటీలకు హాజరైన వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పోలీసు విభాగం గుర్తించింది. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వరుసగా వెలుగులోకి వస్తున్న పాజిటివ్ కేసులు ఈ విషయాన్ని నిర్థారించాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించారు. పూర్వాపరాలు పరిశీలించిన ఆ శాఖ అ«ధికారులు పోలీసు సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు సరఫరాకు అనుమతి ఇచ్చింది.
నగర పోలీసు విభాగానికి మూడు క్లినిక్స్ ఉన్నాయి. బేగంపేట పోలీసు లైన్స్, పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్, అంబర్‌పేట పోలీసు లైన్స్ ప్రాంగణాల్లో ఇవి పని చేస్తున్నాయి. వీటి ద్వారానే పోలీసు సిబ్బందికి ఈ మందులు సరఫరా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గాంధీ ఆసుపత్రి, హాట్‌స్పాట్స్, కంటైన్‌మెంట్ జోన్స్, చెక్‌పోస్టులు, క్షేత్రస్థాయిలో, కార్యాలయాల్లో...ఇలా ఆయా ప్రాంతాల్లో పని చేసిన వాళ్లను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు. శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సిటీ సెక్యూరిటీ వింగ్ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది, అధికారుల జాబితాలు సిద్ధమయ్యాయి. ప్రతి రోజూ ఒక్కో విభాగం నుంచి కొందరిని ఎంపిక చేస్తున్న అధికారులు వారిని ఈ మూడు క్లినిక్స్‌లో అనువైన దానికి పంపిస్తున్నారు. అక్కడ ఉంటున్న వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, వారి మెడికల్ హిస్టరీని పరిశీలించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ఇస్తున్నారు. దీన్ని ఎలా వినియోగించాలి? ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను వైద్యులు సిబ్బందికి వివరిస్తున్నారు. వయసు ఎక్కువ, ఊబకాయం, కొన్ని రుగ్మతలు కలిగి ఉండటం వంటి కేసుల్లో ఈసీజీ వంటి పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే ఈ మందు అందిస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు, భౌతిక దూరం తదితర అంశాల పైనా పోలీసుస్టేషన్ల వారిగా అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment