ప్రైమరీ కాంటాక్ట్‌లో తొలి కరోనా కేసు | Coronavirus One Primary Contact Case In Warangal District | Sakshi
Sakshi News home page

ప్రైమరీ కాంటాక్ట్‌లో తొలి కరోనా కేసు

Published Mon, Apr 13 2020 1:19 PM | Last Updated on Mon, Apr 13 2020 1:19 PM

Coronavirus One Primary Contact Case In Warangal District - Sakshi

సాక్షి, హన్మకొండ: కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఒక్కొక్కరూ కోలుకుంటున్నారనే సమాచారంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న జిల్లాకు పిడుగులాంటి వర్త వచ్చి పడింది. మొదట పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారికి అత్యంత సమీపంగా మెలిగిన వారిలో ఒకరికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. జిల్లాలో మొదట మర్కజ్‌ నుంచి వచ్చిన వారిలో 23 మందిని పరీక్షించగా పాజిటివ్‌ అని తేడంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించారు. అనంతరం వారి బంధువులు, దగ్గరి వారు సుమారు 241 మందిని గుర్తించి నగరంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. సుమారు వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించిన అధికారులు దశలవారీగా వచ్చిన రిపోర్టుల్లో 240 మందిని నెగెటివ్‌గా ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ఒక్క కేసు ఆదివారం పాజిటివ్‌గా రావడంతో యంత్రాంగం తదుపరి చర్యలకు అప్రమత్తమైంది.

ప్రభుత్వ క్వారంటైన్‌లో నలుగురు
ప్రస్తుతం జిల్లాలో అధికారిక సమాచారం ప్రకా రం నలుగురు మాత్రమే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే 797 మంది హోం క్వారంటైన్‌లో వైద్య సిబ్బంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టŠస్‌ కలిగిన 240 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 22 పాజిటివ్‌ కేసులు ఉండగా.. కొత్త కేసుతో 23కు చేరింది. కాగా విదేశాల నుంచి వచ్చిన 814 మంది హోంక్వాంటైన్‌ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే ఆంక్షలు
ప్రస్తుతం పాజిటివ్‌ కేసు నమోదై ఉన్నందున కంటోన్మెంట్‌ ఏరియాగా ఉన్న సుబేదారి ప్రాంతంలో ప్రస్తుతం కొత్త కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతడితో సన్నిహితంగా మెలిగిన వారినికూడా గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయించే అవకాశం ఉంది.

15 నో మూమెంట్‌ జోన్లు
మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 23 మందిని గుర్తించి హైదరాబాద్‌ తరలించిన అధికారులు తరువాత వారి బంధువులను ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు వారి నివాస ప్రాంతాలు మొత్తం నో మూమెంట్‌ జోన్లు, కంటోన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో పాజిటివ్‌ కేసు నివాస ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటి సర్వే చేశారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్యవివరాలు నమోదు చేసుకుని నిత్యం రెండు సార్లు పర్యవేక్షిస్తున్నారు. ఎవరూ బయటకు రాకుండా నిత్యావసరాలు, పాలు వంటివి ఇళ్లకే తెచ్చిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement