లాక్‌డౌన్‌ : జనం మారుతున్నారు.. | Coronavirus : People Slowly Understanding Situation Of Telangana Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ : జనం మారుతున్నారు..

Published Wed, Mar 25 2020 1:38 AM | Last Updated on Wed, Mar 25 2020 10:00 AM

Coronavirus : People Slowly Understanding Situation Of Telangana Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనంలో కొంత మార్పు వచ్చింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా తొలి రోజు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని, కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని అపహాస్యం చేసిన ప్రజలు.. రెండో రోజు కొంత దారికొచ్చారు. లాక్‌డౌన్‌ ఉన్నా, జనం రోడ్ల మీదకు రావటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసిన నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం డీజేపీ మహేందర్‌రెడ్డి స్థానిక అధికారులందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశంతో యావత్తు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై ప్రత్యక్ష చర్యలకు దిగటంతో జనం దూకుడు తగ్గించారు. (దండం పెడుతున్నా.. బయటకు రావొద్దు)

సోమవారంతో పోలిస్తే మంగళవారం పరిస్థితి 70 శాతం అదుపులోకి వచ్చింది. అయినా కొన్నిచోట్ల రోడ్లపై సంచారం కనిపించింది. నిత్యావసరాలకు వచ్చేవారే కాకుండా, కొందరు సరైన కారణం లేకుండా వాహనాలతో రోడ్డెక్కారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ముగ్గురు చొప్పున తిరగటం, కార్లలో నలుగురైదుగురు ప్రయాణించటంతో కొన్ని ప్రాంతాల్లో అనవసర రద్దీ ఏర్పడింది. దీన్ని కూడా ప్రభు త్వం తీవ్రంగానే పరిగణించింది. మంగళవారం నాటి పరిస్థితిని పరిశీలించి అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న సీఎం కేసీఆర్, మంగళవారం సాయంత్రం అత్యున్నత సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో బుధవారం నుంచి పరిస్థితి చాలావరకు అదుపులోకి వచ్చే అవకాశముంది.  

పాతబస్తీతోపాటు కొన్ని ప్రాంతాల్లో.. 
హైదరాబాద్‌ నగరంలో మంగళవారం చాలా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగ్గా కనిపించినా, పాతబస్తీతోపాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంత మెరుగుపడలేదు. పాతనగరంలో యువకులు కొందరు పోలీసులను కవ్వింపు చేసే తరహాలో వ్యవహరిస్తుండ టం విశేషం. పోలీసు వాహనాలు వచ్చినప్పుడు గల్లీల్లోకి వెళ్లి, వాహనాలు వెళ్లగానే మళ్లీ గుంపులుగా వచ్చి రోడ్లపైకి చేరుతూ ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారు. చిన్నచిన్న కారణాలు చెప్తూ కుటుంబాలు కూడా వాహనాలెక్కి రహదారులపైకి రావటం ఇబ్బందిగా మారింది. వారిని ఆపితే కొన్ని చోట్ల పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు.

దీంతో రాచకొండ కమిషనర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు వారివారి పరిధిలో రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి సూచనలు చేయటం కనిపించింది. కొన్ని చోట్ల పోలీ సులు లాఠీలకు పనిచెప్పటంతో వారి ఆగడాలకు కొంత బ్రేక్‌ పడింది. వెరసి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు అవకాశం కల్పించటం తో సోమవారం పూర్తిగా పరిస్థితి అదుపు తప్పగా, కొంతమేర నిర్బంధంగా నిర్వహించటంతో మంగళవారం మెరుగైంది. సీఎం మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నుంచి కర్ఫ్యూ తరహాలో దీని అమలుండే అవకాశం కనిపిస్తోంది. (మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు)

కేఫ్‌లు, పాన్‌షాప్‌ల దొడ్డిదారి అమ్మకాలు.. 
లాక్‌డౌన్‌లో భాగంగా అన్ని కేఫ్‌లు, పాన్‌ దుకాణాలు మూతపడ్డాయి. కానీ చాలా చోట్ల షెట్టర్లు వేసి, లోపల చాయ్‌ తయారు చేసి దొడ్డిదారిన విక్రయిస్తున్నారు. పాన్‌ దుకాణాల తలుపులు మూసేసి, ఆర్డర్‌లు తీసుకుని ప్రతి 10 నిమిషాలకోసారి లోప లి నుంచి పాన్‌లు తెచ్చి అమ్ముతున్నారు. నిర్వాహకులు సమీపంలో కూర్చుని పోలీ సులు లేని సమయంలో ఇలా చేస్తున్నారు. దీంతో ఆయాప్రాంతాల్లోని గల్లీల్లో గుంపులు ఏర్పడుతున్నాయి.

రద్దీగానే మార్కెట్లు.. 


గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ 
కూరగాయలు సహా నిత్యావసరాలు కొనేందుకు వెసులుబాటు ఉండటంతో ఉదయం నుంచి సా యంత్రం వరకు చాలాచోట్ల కొనుగోలుదారులతో రద్దీ ఏర్పడుతోంది. ఇది.. లాక్‌డౌన్‌ అసలు ఉద్దేశానికి తూట్లు పొడుస్తోంది. చాలాచోట్ల ఇరుకు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు పెద్దపెద్ద సమూహాలుగా ఏర్పడుతున్నారు. దుకాణాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. పోలీసులు వచ్చి సూచించిన సమయంలో దూరంగా వెళ్లి మళ్లీ తర్వాత గుమికూడుతున్నారు. దీన్ని నిరోధించాల్సిన అవసరముంది.

కూరగాయల వ్యాపారులను దూరం దూరంగా ఉంచటంతోపాటు ఒక అమ్మకందారు వద్ద ఐదారురకాల కూర గాయలు లేకుండా కేవలం ఒక్క రకం మా త్రమే ఉండేలా చేయాలన్న సూచనలు వస్తున్నాయి. ఇరుకుగా ఉండే ప్రాంతాల నుంచి విక్రేతలను విశాలంగా ఉండే చోట్లకు మార్చాలని, కుదిరితే స్థానిక మైదానాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. పాల దుకాణాలు, కిరాణా దుకాణాల వద్ద ఇద్దరిద్దరు చొప్పున కొనుగోలుదారులు వచ్చేలా కట్టడి చేయాలంటున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రార్థనామందిరాలకు గుంపులుగా వెళ్తున్నారు. దీన్ని కూడా వెంటనే నిరో ధించాలని సూచిస్తున్నారు. జామియా నిజామియాలో ముస్లిం మత ప్రముఖులు సమావేశమై ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల ని సూచించటంతో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement