మహమ్మారి.. దారి మారి!  | Coronavirus Positive Cases Increasing In Hyderabad GHMC | Sakshi
Sakshi News home page

మహమ్మారి.. దారి మారి! 

Published Mon, May 18 2020 6:30 AM | Last Updated on Mon, May 18 2020 7:42 AM

Coronavirus Positive Cases Increasing In Hyderabad GHMC - Sakshi

మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశంలో హరివిల్లు విరిస్తే.. అవి తమ కోసమేనని ఆనందించే చిన్నారుల పాలిట కరోనా మహమ్మారి అశనిపాతంలా పరిణమించింది. తల్లిదండ్రుల నుంచి వీరికి వైరస్‌ సోకుతోంది. అక్కడితోనే ఆగకుండా పిల్లలకు సన్నిహితంగా మెలిగిన తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలను సైతం కోవిడ్‌ వెంటాడుతోంది. ఇలా మూడు తరాల వారికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. అలాగే.. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అందరికీ ఆనందమే. దావత్‌ చేసుకోవడం ఇంటిల్లిపాదికీ సంతోషదాయకమే. కానీ ఈ వేడుకలే కొంపముంచుతున్నాయనేందుకు ఇటీవల సంతోష్‌నగర్‌ మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెలుగు చూసిన 39 పాజిటివ్‌ కేసుల ఘటనే నిదర్శనం.

అంతకు ముందు వనస్థలిపురంలోనూ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన 27 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇలా.. బర్త్‌డే పార్టీలైనా, దావత్‌లైనా మొత్తం కుటుంబాలనే విషాదంలోకి నెట్టివేస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులంతా కరోనాతో ఆస్పత్రిలో చేరుతుండటం, ఒక్కొక్కరూ ఒక్కో వార్డులో అనాథల్లా ఉండిపోవాల్సి రావడం, బాధితుల్లో ఎవరైనా చనిపోతే.. కనీసం వారిని కడసారి చూసేందుకు కూడా నోచుకోలేని దుస్థితి రావడం హృదయ విదారకం. ఇలా విభిన్న దారుల్లో కరోనా కోరలు సాచి వెంటాడుతోంది. (వలస కూలీలకు లోటు రానివ్వొద్దు)

సాక్షి,  హైదారాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో వృద్ధులెవరూ ఇంటి గడప దాటి బయటికి వెళ్లలేదు. కానీ వారిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. ఎలా? అని వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీయగా.. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడిన వృద్ధుల్లో చాలా మందికి తమ ఇంట్లోని పిల్లల ద్వారానే వైరస్‌ సోకినట్లు గుర్తించింది. తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకు.. వారి నుంచి వృద్ధులకు వైరస్‌ సోకుతున్నట్లు స్పష్టమైనట్లు పేర్కొంది. ఇంట్లోని పిల్లలు ఖాళీ సమయంలో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మల వద్దే ఎక్కువ సమయం గడుపుతుంటారు. పిల్లలు మారాం చేయడంతో వారిని ఎత్తుకోవడం, హత్తుకోవడం, ముద్డాడటం వంటివి చేస్తుంటారు. అప్పటికే నిత్యావసరాల పేరుతో మార్కెట్లకు వెళ్లి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు వైరస్‌ సోకడంతో ఆ తర్వాత వారి పిల్లలకూ సోకుతోంది. వీరిలో అసింప్టమెటిక్, మైల్డ్‌ సింటమ్స్‌ (వైరస్‌ లక్షణాలు బయటికి కన్పించకపోవడం) ఉండ టం వల్ల వైరస్‌ ఉన్నట్లు తెలియడం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులపై ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతోంది. తీరా వారు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి ఆస్పత్రుల్లో చేరుతుండటంతో అసలు విషయం బయటికి వస్తోంది. అప్పటికే నష్టం జరిగిపోతోంది. ఇంట్లో నుంచి కనీసం కాలు కూడా బయటపెట్టని ఈ వృద్ధులకు వైరస్‌ ఎలా సోకిందో తెలియక వారి బంధువులు తలపట్టుకుంటున్నారు. తీరా పిల్లల ద్వారానే వారికి సోకినట్లు తెలిసి షాక్‌ అవుతున్నారు.  (మరో 42 మందికి..)

కొంపముంచుతున్న వేడుకలు 
పిల్లల పుట్టిన రోజు వేడుకలు పెద్దల పాలిటశాపంగా మారుతున్నాయి. ఓ వైపు వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తుంటే.. మరో వైపు తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలను ఎంతో అట్టహాసంగా చేస్తున్నారు. బంధువులు, ఇరుగు పొరుగున ఉన్న సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. వారి ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉండటంతో వారు కూడా వెళ్లి వస్తున్నారు. అప్పటికే ఇంట్లోని వ్యక్తులకు వైరస్‌ ఉండటం, లక్షణాలు బయటపడకపోవడంతో తాము ఆరోగ్యంగా ఉన్నట్లు భావించి వేడుకలకు ఇతరులను ఆహ్వానించడం, అప్పటి వరకు అంతర్లీనంగా దాగి ఉన్న వైరస్‌.. వేడుకలకు హాజరైన ఇతర పిల్లలకు విస్తరిస్తోంది.  ఆ పిల్లల ద్వారా వారి ఇంట్లోని వృద్ధులకు విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. తాజాగా సంతోష్‌నగర్‌ మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఇక్కడి పిల్లలందరినీ వీటికి ఆహ్వానించారు. (ప్రైవేట్‌లోనూ కరోనా)

అపార్ట్‌మెంట్‌లోని 13 ప్లాట్స్‌లో 59 మంది వరకు ఉన్నారు. బర్త్‌డే బేబీ తండ్రికి కరోనా వైరస్‌ సోకినట్లు ఈ నెల 9న నిర్ధారణ అయింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న 54 మందిని క్వారంటైన్‌ చేసి, పరీక్షలు చేయగా.. 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో గర్భిణి సహా వృద్ధులు కూడా ఉన్నట్లు తెలిసింది. పిల్లల ద్వారానే పెద్దలకు వైరస్‌ విస్తరించి ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. అంతకు ముందు వనస్థలిపురం ఎ–క్వార్టర్స్‌లో ఉండే వ్యక్తి ఇటీవల ఇంట్లో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి హాజరైన సమీప బంధువులు, వారి డ్రైవర్, వంట మనిషి ఇలా మొత్తం 27 మంది వైరస్‌ బారిన పడాల్సి వచ్చింది.   

కామన్‌ బాత్‌రూమ్‌లూ..  
నగరంలోని చాలా బస్తీలు ఇరుకుగా ఉంటాయి. 100–120 గజాల స్థలంలో మూడు నాలుగు అంతస్తుల భవనాలు నిర్మిస్తుంటారు. శివారులోని పలు ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసి, కూలీలకు అద్దెకు ఇస్తుంటారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సాన్నాల గదులు నిర్మించరు. అందరికీ కలిపి కా మన్‌గా ఒకటి రెండు బాత్‌రూమ్‌లనే ఏర్పాటు చేస్తుంటారు. ఇంటి ప్రాంగణంలో ఉన్న వారిలో ఏ ఒక్కరికి కరోనా వైరస్‌ సోకినా.. వారి ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదు. తాజాగా మంగళ్‌హాట్‌ పరిధిలోని కామటిపురకు చెందిన ఓ సేల్స్‌ మేనేజర్‌కు ఇటీవల కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది. అదే ఇంట్లోని ఆరు కుంటుంబాలు ఉన్నాయి. వీరందరికీ కామన్‌గా ఒకే బాత్‌రూమ్‌ ఉండటం, ఒకరు వాడిన తర్వాత మరొకరు వినియోగించడం వల్ల కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఆ తర్వాత ఇదే బాత్‌రూమ్‌ ద్వారా మొత్తం 24 మందికి వైరస్‌ సోక డం విశేషం.  

గ్రేటర్‌లో 168 కుటుంబాలు.. 1008 మందికి ఎఫెక్ట్‌   
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 2 నుంచి ఈ నెల 16వ తేదీ నాటికి 485 కుటుంబాల్లో 1509 మంది కరోనా వైరస్‌ బారిన పడితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 168 కుటుంబాల్లోని 1008 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుటుంబంలో సగటున ఆరుగురు వైరస్‌ బారిన పడినట్లు అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement