సాక్షి, హైదరాబాద్: కరోనాను ఎదుర్కోటానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం కొత్తపేట సర్కిల్‌లో కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనికోసం వాహనదారులను రోడ్డుపైనే కొన్ని నిమిషాలపాటు నిలిపివేశారు. అనంతరం ఐదుగురు పోలీసులు వారికెదురుగా నిలబడి కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. ఇందుకోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలన్నారు. చేతులను 20 సెకండ్లపాటు కడుక్కోవాలని పేర్కొన్నారు. (బస్సుల్లో హ్యాండ్ శానిటైజర్లు)
అంతేకాక చేతులను ఏవిధంగా కడుక్కోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. పత్రి వ్యక్తికి ఒక మీటర్ దూరంగా ఉండి మాట్లాడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరమని నొక్కి చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, అందరికీ నమస్కారం మాత్రమే పెట్టాలని కోరారు. అనంతరం దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ‘భయపడవద్దు.. భద్రత పాటిద్దాం - కలిసికట్టుగా కరోనా అరికడుదాం’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (పదో తరగతి విద్యార్థులకు మాస్కులు)
Comments
Please login to add a commentAdd a comment