సాక్షి, హైదరాబాద్ : దుబాయ్ నుంచి వచ్చి బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. కరోనా లక్షణాల ఉండటంతో అతన్ని బస్సులో నుంచి దించివేశారు. ఈ ఘటన ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండపాటి నాని(22) దుబాయ్ నుంచి విమానంలో ముంబై చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన నాని ప్రైవేటు బస్సులో భీమవరం బయలుదేరాడు. అయితే నాని చేతిపై స్టాంప్‌ను గుర్తించిన తోటి ప్రయాణికులు దాని గురించి ఆరా తీశారు. వారు అలా అడిగేసరికి నాని కంగారు పడ్డాడు. దీంతో నాని ప్రవర్తనపై అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు అతన్ని బస్సులో నుంచి కిందికు దింపారు. అనంతరం అధికారులకు సమచారం అందజేశారు.
దీంతో రంగంలోకి దిగిన ఎల్‌బీ నగర్ పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. కాగా, ముంబై క్వారంటైన్ సెంటర్ నుంచి నాని తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళక కలిగిస్తుంది. ముఖ్యంగా కరోనా సోకినవారిలో విదేశాల నుంచి వచ్చినవారే అధికంగా ఉన్నారు. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి భారత్ చేరుకున్నవారికి ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్ నిర్వహించడంతో.. క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అలాగే కరోనా లక్షణాలు లేనివారికి ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటే మంచిందని సూచిస్తున్నారు. కొన్ని చోట్ల విదేశాల నుంచి వచ్చినవారి చేతులపై స్టాంప్‌లు వేస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment