సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌కు విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్ దేశాలు, భారత్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన వంద లాది మంది శాస్త్రవేత్తలు కోవిడ్ మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లగా, వైరస్‌లను నియంత్రించడంలో అనుభవమున్న ఫార్మా కంపెనీలు, ఇతర సంస్థల సాయంతో వివిధ దేశాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందన్నది శాస్త్రవేత్తల మాట.
చైనా ఏం చేస్తోందంటే..
కోవిడ్ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు అనుక్షణం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్ సైన్సెస్‌లో ఈ పని జరుగుతోంది. ఇక్కడ వ్యాక్సిన్ తయారైందని, క్లినికల్ ట్రయల్స్ కోసం వలంటీర్ల వైపు చూస్తోందని తెలుస్తోంది. చైనాకు చెందిన మరో సంస్థ 133.3 మిలియన్ డాలర్లతో ఓ జర్మన్ కంపెనీతో వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి.
ఈ వైరస్ బయటపడడానికి ముందే తమ పరిశోధనలను చైనా దొంగిలించే ప్రయత్నం చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. యూరోప్ దేశాలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. కాగా, అమెరికాకు చెందిన మోడర్నా అనే కంపెనీ ఈ వైరస్ జన్యుకోడ్ వెలుగులోకి వచ్చిన 42 రోజుల్లోనే ఓ వ్యాక్సిన్‌ను తయారుచేసి 45 మంది ఆరోగ్యవంతులపై ప్రయోగించి విజయవంతం అయిందన్న వార్తలొస్తున్నాయి. చైనాకు చెందిన క్యాన్‌సినో అనే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను కూడా అక్కడి ప్రభుత్వం ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించింది. క్యూర్‌వేక్, బయో ఎన్‌టెక్, ఇనోవియో, శానోఫి ఫ్రాన్స్, రోచే, ఎలీలిల్లీ, జాన్సన్ అండ్ జాన్సన్, నోవావ్యాక్స్ లాంటి కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేశాయని జాతీయ, అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి.
మనమూ ముందు వరుసలోనే..
భారతదేశంలోనూ కోవిడ్ నడ్డి విరిచే వ్యాక్సిన్ తయారీ ముమ్మరమైంది. ఇందుకు ఈ రంగంలో అనుభవమున్న ముంబైకి చెందిన సిప్లా కంపెనీ రంగంలోకి దిగింది. త్వరలోనే ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో పలు వైరస్‌లను నియంత్రించిన వ్యాక్సిన్‌లు కోవిడ్‌ను కూడా నియంత్రించగలవా అనే దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయి.
కోవిడ్ కట్టడికి తలో చెయ్యి!
Published Tue, Mar 24 2020 3:00 AM | Last Updated on Tue, Mar 24 2020 11:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment