శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్లో డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి వలస కార్మికుల తరలింపు ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : వలస కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లతో సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, ఘట్‌కేసర్ స్టేషన్లు శనివారం పోటెత్తాయి. వేలాది మంది కార్మికులు సొంతూళ్లకు తరలివెళ్లారు. సికింద్రాబాద్ నుంచి పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. నాంపల్లి నుంచి 8, ఘట్‌కేసర్ నుంచి 7, లింగంపల్లి నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదు చేసుకున్న వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా రైల్వేతో కలిసి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పెద్దఎత్తున ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఒక్కో ట్రైన్‌లో 1,250 నుంచి 1,650 మంది వరకు ప్రయాణించారు. మరోవైపు రద్దీ కారణంగా భౌతికదూరం పాటించడంలో విఫలమయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వలస ప్రయాణికులతో నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గందరగోళం నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 300 ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను ఆయా రైల్వేస్టేషన్లకు తరలించారు. ప్రయాణికులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, పండ్లు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లడానికి శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట క్యూ కట్టిన వలస కార్మికులు
వెళ్లినవారు మళ్లీ వస్తామన్నారు: సీఎస్ సోమేశ్‌కుమార్
స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న మరో 50 వేల మంది వలస కార్మికులను రైళ్లలో పంపించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పారు. శనివారం ఒక్కరోజే వివిధ స్టేషన్ల నుంచి 40 రైళ్లను ఏర్పాటుచేసి అర్ధరాత్రికల్లా వారిని తరలించినట్టు వెల్లడించారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో శ్రామిక్ రైళ్లను డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శనివారం వెళ్లిన రైళ్లకు అదనంగా ఇప్పటివరకు 88 రైళ్లలో మొత్తం 1.22 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించామన్నారు. రాష్ట్రం నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్న కార్మికులంతా దాదాపు శనివారం వెళ్లిపోయారని, వెళ్లిన వారంతా మళ్లీ రాష్ట్రానికి వస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణానికి వలస కార్మికులే కీలకమన్నారు. అడిషనల్ డీజీ జితేందర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌రోస్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్, లింగంపల్లి నుంచి..
ఘట్‌కేసర్ స్టేషన్ నుంచి శనివారం 7 శ్రామిక్ రైళ్లు నడిచాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వలస కార్మికులకు ప్రత్యేక పాస్‌లు జారీచేసి ఆర్టీసీ బస్సుల్లో ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌కు తరలించారు. వీరిని మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ ప్రసాద్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, రైల్వే ఉన్నతాధికారుల మార్గదర్శనంలో సాగనంపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతులపై వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ పూర్తయ్యాక మళ్లీ తిరిగి వస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సారంగాపూర్, డియోరియా, మొగల్‌సరాయి, మావ్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాలకు 8 ప్రత్యేక రైళ్లు లింగంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్‌కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, రైల్వే అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment