గుట్టుచప్పుడు కాకుండా ఓ బాలికకు పెద్దలు వివాహం చేయగా అధికారులు ఆ బాలికను చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం తరిగోపుల గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య, మంజుల దంపతుల కూతురు స్వప్న(15) అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. చేవెళ్ల మండలం తంగెడ్‌పల్లి గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌కు బాలికతో ఈనెల 3న వివాహం చేశారు.
పెళ్లిని అడ్డుకునేందుకు అధికారులు వెళ్లగా అప్పటికే వారు గ్రామం విడిచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు స్వప్నకు తంగెడ్‌పల్లి గ్రామంలో వివాహం జరిపించారు. ఈ విషయం బుధవారం బయటపడటంతో చైల్డ్‌లైన్ ఆర్గనైజర్ సంజమ్మ గ్రామానికి వెళ్లి వివాహమైన బాలికను, ఆమె తల్లిదండ్రులను తహశీల్దార్ వద్దకు తీసుకె ళ్లారు. తహశీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుశీల వారికి కౌన్సెలింగ్ చేపట్టి సర్దిచెప్పారు. మైనారిటీ ముగిసిన తర్వాతే ఆమెను తీసుకెళ్లాలని కోరారు. అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ హోంకు తరలించారు.