సాక్షి, హైదరాబాద్: కరోనా.. కరోనా.. అంతటా దీని గురించే చర్చ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్ తీవ్రత ఇప్పుడు మన దగ్గర రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపులతో జనజీవన సందడి పెరిగిన వేళ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని, బయటికెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, ఇంట్లోకి రాగానే శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుతం కరోనా వైరస్ నిర్మూలనకు ప్రత్యేకించి మం దులు, వ్యాక్సిన్ లేనందున దానితో సహజీవనం చేయక తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఈ వైరస్ మనలోకి ప్రవేశిస్తే ఎలా? అనే సందేహం అందరికీ వచ్చేదే. సైదాబాద్ సమీపంలో మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 60శాతం మందికిపైగా కరోనా వైరస్ బారినపడడం కలకలం రేపింది. ప్రస్తుతం వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో ఓ పేషెంట్ అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘‘తొలుత మా అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు మా అపార్ట్‌మెంట్ వాసులందరినీ సరోజినీదేవి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా దాదాపు సగం మందికిపైగా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజల్ట్ చెప్పిన వెంటనే ఊపిరి ఆగినంత పనైంది. మా ఇంట్లో ముగ్గురికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించింది. కానీ నాలో ఆత్మవిశ్వాసం సడలలేదు. ఇద్దరికీ ధైర్యం చెప్పా. జాగ్రత్తగా ఉండాలని సూచించా. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ముగురినీ మూడు వార్డుల్లో ఉంచారు.
ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజు నాకు దగ్గు, జ్వరం మొదలైంది. వైద్యలు వెంటనే ఐసీయూకి తరలించి పారాసిటమాల్‌తో పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, యాంటిబయాటిక్ మాత్రలు ఇచ్చారు. మూడు రోజుల్లో కోలుకున్నా. రెండ్రోజులుగా నా ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో మూడు రోజులు ఇదే స్థాయిలో ఉంటే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాననిపిస్తోంది. కానీ నాకు కరోనా పాజిటివ్ రావడంతో మా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు సైతం కలత చెందారు.
ఒకరితర్వాత ఒకరు వరుసగా ఫోన్లు చేయడం, సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పడంతో నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. వాట్సాప్‌లో దాదాపు రెండువేల మెసేజ్‌లు వచ్చాయి. నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారా.. అనే భావన నన్ను మరింత దృఢంగా చేసింది. మనకు కష్టం వచ్చినప్పుడు మన వెనక ఎవరుంటారనే సందేహం రావడం సహజం. కానీ నాకు ఇంతమంది ధైర్యాన్నివ్వడంతో చాలా త్వరగా కోలుకున్నా. ఈ వైరస్ వస్తే చనిపోతామనే అపోహ వద్దు. సకాలంలో గుర్తించి వైద్యుల సలహాలు పాటిస్తే చాలా ఈజీగా నమయవుతుంది.
వసతులు బాగున్నాయి..
గాంధీ ఆస్పత్రిలో సేవలు చాలా బాగున్నాయి. సౌకర్యాలతో పాటు వాష్‌రూమ్‌లు, ఐసీయూలు, వార్డులన్నీ కార్పొరేట్ ఆస్పత్రి కంటే బాగున్నాయి. తొలుత తీసుకెళ్లిన సరోజినీదేవి ఆస్పత్రిలో వసతులు చూసి చాలా ఆందోళన చెందా. కరోనా పాజిటివ్ రావడంతో బతుకుతానా? లేదా? అనే సందేహం వచ్చింది. కానీ గాంధీలో చేరాక ఆ ఆలోచన పోయింది. సరోజినీదేవి ఆస్పత్రిలో వసతులు మరింత మెరుగుపర్చాలి’’.
Comments
Please login to add a commentAdd a comment