సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసిరింది. బుధవారం ఒక్కరోజే 8 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కలకలం చెలరేగుతోంది. పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. 13 కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 8 మంది ఇండొనేషియాకు చెందినవారే ఉండటం గమనార్హం. మొత్తం 10 మంది ఇండోనేసియా బృందం కరీంనగర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒకరికి మంగళవారమే కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడితో పాటు, మరో ఏడుగురు ఇండోనేసియన్లు కోవిడ్ బారిన పడినట్లు ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం రాత్రి 11 గంటల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇండోనేసియా బృందంలోని మరో ఇద్దరికీ మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. వారికి సహకరించిన హైదరాబాద్ వాసికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్‌లో వీరిని కలసిన 11 మందిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇంకా వీరు ఎవరెవరిని కలిశారో జల్లెడ పడుతున్నామని చెప్పారు. కోవిడ్ కేసులు బయటపడటంతో బుధవారం రాత్రి మొత్తం కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలోనే ఉండి మంత్రి ఈటల పర్యవేక్షిస్తున్నారు.
మరో యువకుడికి పాజిటివ్..
స్కాట్లాండ్లో బీబీఏ చదువుతున్న మేడ్చల్ జిల్లా నాచారానికి చెందిన యువకుడి(22)కి బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నెల 14న బయల్దేరి 16న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి తర్వాత ఇంటికి పంపారు. ఆ రోజంతా ముగ్గురు కుటుంబసభ్యులతో గడిపాడు. 17న ఉదయం దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కన్పించడంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. కోవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలింది. అతడితో కలసి విమానంలో 150 ప్రయాణించినట్లు తెలిసింది. వారందరినీ గుర్తించే పనిలో వైద్య ఆరోగ్యశాఖ నిమగ్నమైంది.
నేరుగా ఎవరికీ సోకలేదు..
ఇప్పటివరకు రాష్ట్రంలో నేరుగా ఎవరికీ వైరస్ సోకలేదు. అయితే ఇండొనేషియన్ల ద్వారా ఇక్కడి వారికి వైరస్ సోకిందా అనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. తొలుత దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత అతడు కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత బయటపడిన పాజిటివ్ కేసులు కూడా విదేశాల్లో సోకినవారే. అయితే వారు వచ్చాక.. ఇక్కడి వారెవరికీ సోకకపోవడం గమనార్హం. కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అనే వచ్చింది.
చదవండి:
ప్లీజ్ .. పెళ్లికి అనుమతించండి..
ఆ బ్లడ్ గ్రూపు వాళ్లు తస్మాత్ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment