సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపైనా కరోనా పంజా విసురుతోంది. అన్నిరకాల జాగ్రత్తలు పాటిçస్తూ చికిత్స చేసేందుకు ముందుకొస్తున్నప్పటికీ వారుకూడా కరోనా బారిన పడి ప్రాణాపాయస్థితికి వెళ్తున్నారు. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఎక్కువ మంది వైద్యులు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో వైద్యుల సంరక్షణ చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తమ వైద్యులు, వైద్య సిబ్బందికి పాయింట్లు నిర్దేశించి డ్యూటీలు కేటాయిస్తున్నాయి. కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులు, వైద్య సిబ్బంది వయసు, ఆరోగ్యస్థితి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటూ వారికి స్కోర్ ఇస్తున్నాయి. ఈ స్కోర్ ఆధారంగా అన్ని విధాలుగా ఫిట్‌గా ఉన్న వారికి మాత్రమే కరోనా చికిత్సకు అనుమతిస్తూ..ఇతర సమస్యలున్న వారిని స్థాయి ఆధారంగా కరోనేతర విభాగాల్లో, పరిపాలన విభాగాల్లో విధులు కేటాయిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, లండన్, ఆ్రస్టేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో వైద్యులు, సిబ్బందిని విభజించి విధులు కేటాయిస్తున్నారు. దీంతో వారియర్స్‌ను రిస్క్‌లోకి లాగకుండా ఉండటంతో పాటు పేషెంట్లకు మెరుగైన సేవలు అందించే పరిస్థితి ఏర్పడుతుంది.
స్కోర్ ఆధారంగా విధులు
ఆస్పత్రుల్లో చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బందికి తొలుత స్కోర్ నిర్దేశిస్తున్నారు. పేషంట్ వయసు, జెండర్ కేటగిరీకి మార్కులు వేస్తారు. కరోనా వైరస్ ప్రభావం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ ప్రభావం ఉండటంతో కరోనా వార్డుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హృదయ సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఒబెసిటీ, కుటుంబ నేపథ్యం ఆధారంగా మార్కులు ఇస్తున్నారు. స్కోర్ 0–3 మధ్య ఉన్న వారు తక్కువ రిస్‌్కగా పరిగణిస్తూ వాళ్లకు అన్ని రకాల డ్యూటీలకు పంపుతున్నారు. స్కోర్ 4–6 మధ్య ఉన్న వారికి నాన్ కోవిడ్ వార్డుల్లో డ్యూటీలు వేస్తుండగా... వారు పీపీఈ కిట్లు ధరించేలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొందరికి పాలనపరమైన విభాగాల్లో విధులు కేటాయిస్తున్నారు.
స్కోర్ 7 కంటే ఎక్కువగా ఉన్న వారికి ఆస్పత్రిలో ప్రత్యక్ష విధులకు దూరంగా ఉంచుతూ..టెలీమెడిసిన్ విభాగాల్లో విధులు కేటాయిస్తున్నారు. ఈ పని విభజనతో వైద్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడకుండా ఉంటుందని, పేషంట్లకు పూర్తి స్థాయిలో సేవలు అందించవచ్చని అమెరికాకు చెందిన ఓ సంస్థ పరిశీలన చెబుతోంది. ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని స్థానిక వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వార్డుల్లోకి గర్భిణీ వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే అనుమతి లేదు. జనాభా నిష్పత్తితో పోలిస్తే మన దేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నందున జాగ్రత్తగా వర్క్ ఫోర్స్‌ను డీల్ చేయాలని డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment