సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అన్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువగా ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వివరించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగిన ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖతోపాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(చదవండి: కరోనా బ్రేకింగ్: గాంధీలో 8 మంది అనుమానితులు!)
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వైరస్‌పై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.
(చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘కరోనా’ అలర్ట్)
కరోనా సమస్యను ఉపయోగించుకుని.. ఎవరైనా వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రజలను చైతన్యం చేసేందుకు పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించాలని, దీనికోసం సమాచార, ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
కరోనాకు ప్రత్యేక ఆస్పత్రి: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
వైద్యారోగ్య శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కరోనా పేషంట్లకు చికిత్స అందించేదుకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 9 విభాగాల సమన్వయంతో పనిచేస్తాం. ప్రతి విభాగానికి ఒక నోడల్ ఆఫీర్ ఉంటారు. ఊపిరితత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపడా మందిని తీసుకుంటాం. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నాం. కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించండని కోరాం. ప్రజలకు విశ్వాసం కలిగించడం మన బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment