
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతురామ్మోహన్ డ్రైవర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. ప్రతినిత్యం వందల మంది సంచరించే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుం డటంతో సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. కొద్దిరోజుల క్రితం మేయర్ బొంతు రామ్మోహన్ రాంనగర్‌గుండు వద్ద హోటల్‌లో టీ తాగడం..ఆ హోటల్‌కు చెందిన కార్మికుడికొకరికి కరోనా సోకినట్లు వెల్లడైన నేపథ్యంలో అనుమాన నివృత్తికి మేయర్ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే మేయర్ కార్యాలయానికి చెందిన అటెండర్‌కు బుధవారం పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, గురువారం డ్రైవర్‌కు నిర్ధారణ అయింది.
అంతకుముందు ఘనవ్యర్థాల నిర్వహణ విభాగంలో ఒకరికి పాజిటివ్ రావడం తెలిసిందే. మేయర్ డ్రైవర్ గురువారం సైతం సాయంత్రం వరకు విధులు నిర్వహించారు. అతనిలో జ్వరం, జలుబు వంటి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. మేయర్‌తోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మేయర్ కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్‌గా ఉన్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మేయర్‌కు కూడా మరోసారి కరోనా పరీక్షలు చేయనున్నారు. డ్రైవర్‌ను ఎవరెవరు కలిశారనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీలోని పలువురు ఉద్యోగులు కొన్ని రోజులపాటు కార్యాలయానికి వెళ్లొద్దని భావిస్తున్నారు. సిబ్బంది భయాందోళనలతో అధికారులు పాజిటివ్ వివరాలు వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment