
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ రూపొందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం మఖ్ధూంభవన్‌లో విడుదల చేశారు. ‘సేవ్ నేషన్–సేవ్ కాన్‌స్టిట్యూషన్–సేవ్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం’అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతులు, యువత, మహిళల కోసం పలు హామీలను ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. కేంద్రంలో తమ పార్టీ మద్దతుతో ఏర్పాటయ్యే ప్రభుత్వం వీటిని తప్పనిసరి అమలు చేసేలా సీపీఐ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం
రైతుల కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయడం, సాగుకయ్యే పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం వరకు మద్దతు ధర కల్పించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, ఏకకాల పంట రుణమాఫీ అంశాలకు సీపీఐ ప్రాధాన్యతనిచ్చింది. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చేలా చర్యలు, ప్రతి ఒక్కరికి ఉపాధి హక్కును కల్పించడం, అన్ని విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ, నేషనల్ యూత్ పాలసీ రూపకల్పన, క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన అంశాలను మేనిఫెస్టోలో పేర్కొంది. చట్టసభలు, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఒంటరి మహిళలకు న్యాయ, ఆర్థిక సాయం అందించే కార్యక్రమాల అమలు, చిన్నారుల్లో పౌష్టిక లోపాల నిర్మూలనకు చర్యలు, మానవ అక్రమ రవాణా నిలుపుదలకు కఠి న చర్యలు తీసుకునే ఏర్పాట్లకు మద్దతు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్, పదవీ విరమణ పొందిన రక్షణ ఉద్యోగులకు వన్ ర్యాంకు వన్ పెన్షన్ అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చింది.
విద్యకు 10 శాతం అదనపు కేటాయింపులు
మైనారిటీలకు జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ సిఫార్సుల అమలు, రంగనాథ్ మిశ్రా కమిటీ ప్రతిపాదనలు అమలుకు సీపీఐ మద్దతు తెలిపింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక, మాధ్యమిక విద్య ఉచితంగా చేపట్టాలని, విద్యకు మరో 10 శాతం అదనపు నిధుల కేటాయింపు, ఉపాధ్యాయ ఖాళీలను వంద శాతం భర్తీ చేయాలని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత–వైద్య విద్య వ్యాపారాన్ని ఎత్తేసేలా చర్యలు, పర్యావరణ పరిరక్షణ, ఆడవులు, సహజవనరులపై నిఘా పెంపొందించేలా చర్యలకు ప్రాధాన్యతనిచ్చింది. విదేశీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కశ్మీర్ సమస్య పరిష్కర అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చింది. దేశంలో అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment