కొల్లాపూర్: పాలమూరు జిల్లాపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా సీపీఐ పార్టీ ప్రథమ మహాసభలు సోమవారం కొల్లాపూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో సీపీఐ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజా బంగ్లా ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీశ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో సంఘ్‌పరివార్ శక్తుల హింస ప్రజ్వరిల్లుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. ఇక తెలంగాణలో దొంగల రాజ్యం.. దోపిడీ పాలన కొనసాగుతోందన్నారు.
సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై లేదన్నారు. మూడేళ్ల క్రితం సీపీఐ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని సీఎంకు లేఖ రాసినా పూర్తి చేయలేదన్నారు. ఆంధ్రోళ్ల పాలనలో మనకు ఉద్యోగాలు వస్తలేవు అన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. పంటకు ఎందుకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదో చెప్పాలన్నారు.
అమావాస్య చీకటిలో ఉన్నారు..
కమ్యూనిస్టుల పని అయిపోయిందని మోదీ, కేసీఆర్ మాట్లాడుతున్నారని.. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్టులు అమావాస్య చీకట్లో ఉన్నారని, త్వరలోనే పున్నమి వెలుగుల్లోకి వస్తామన్నారు. విడిపోయి పడిపోయామని, చీలిపోయి చితికిపోయామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కమ్యూనిస్టులు ప్రజల గొంతుకగా ఉంటారన్నారు.
రాజీలేని పోరాటం
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టులు ప్రజలపక్షాన పోరాటాలు చేయాలన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఈర్లనర్సింహా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌నర్సింహ ప్రసంగించారు. సభలో నాయకులు ఆనంద్‌జీ, ఫయాజ్, కేశవులు, వార్ల వెంకటయ్య, కొమ్ము భరత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment