
‘సామాజిక న్యాయాన్ని’ కేంద్ర బిందువు చేశాం
⇒ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
⇒ ప్రభుత్వం, బడ్జెట్ ఇదే అంశం చుట్టూ తిరిగాయి
⇒ తెలంగాణ వచ్చాక కూడా అణగారిన వర్గాలకు మేలు జరగలేదు
⇒ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో సాక్షి ప్రత్యేక ఇంటర్వూ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయ నినాదాన్ని భవిష్యత్ ఎజెండాగా ముందుకు తీసుకురావడంలో తమ పాదయాత్ర కృతకృత్య మైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం చుట్టూ రాజకీయాలు, ప్రభుత్వ చర్యలు సాగాలన్న తమ ప్రధాన లక్ష్యం నెరవేరిందన్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లోనూ ఆయా అంశాలను పొందుపరచక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వా నికి ఏర్పడిందన్నారు. అయితే ప్రగతి పద్దులో రూ.88 వేల కోట్లు పెట్టి, రాష్ట్రంలో యాభైశాతం పైగా జనాభా ఉన్న బీసీలకు కేవలం రూ. 5 వేలు కేటాయించడమంటే ఏమేరకు న్యాయం చేసినట్టు అని ప్రశ్నించారు.
తమ పాదయాత్రకు అన్ని రాజకీయపార్టీలు, సంఘాలు సంపూర్ణంగా మద్దతు తెలపడం శుభపరిణామమని చెప్పారు. సరిగ్గా అయిదునెలల క్రితం గత అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీలోని వివిధ సామాజికవర్గాలకు చెందిన ఎనిమిది మంది సహచరులతో కలసి తమ్మినేని మహాజన పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు 4,200 కి.మీ. సాగిన పాదయాత్ర శనివారం హైదరాబాద్‌కు చేరుకోనుంది. అనంతరం ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించ నున్న బహిరంగసభతో ముగియనుంది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రంతో ఫోన్లో సాక్షి ప్రతినిధి జరిపిన ఇంటర్వూ్యలోని ముఖ్యాం శాలు... ఆయన మాటల్లోనే...
రాష్ట్రం వచ్చినా పరిస్థితి మారలేదు
‘‘తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి పథకాలు ఎక్కడా అమలు కావడం లేదు. మూడేళ్ల కాలంలో ఈ వర్గాలకు కేటాయించిన నిధులు సగం కూడా ఖర్చుకాకపోగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రవాణా తదితరాలకు దారిమళ్లాయి. రైతులు, కూలీలు, ఇతర వర్గాల వారు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ముందటిలాగానే ఇంకా కొనసాగుతున్నాయి. ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఆర్‌ఎస్ సర్కార్‌కు చేతులు రాలేదు.
గ్రామస్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేయడానికి పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాజిక న్యాయాన్ని ఎజెండాగా అంగీకరించే పార్టీలు, సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే సామాజిక సమరసమ్మేళనం పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.ఈ సభ తర్వాత ప్రతి ఒక్క సంఘం, సంస్థలతో వేర్వేరుగా మాట్లాడి ఉమ్మడి ఎజెండాను ఖరారుచేసి ఒక ఫ్రంట్ లేదా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకుంటాం. ’’అని అన్నారు.