
పాదయాత్రతో ప్రభుత్వానికి భయం
అందుకే ప్రాజెక్టుల బాట వదిలి కులాల బాట పట్టింది: తమ్మినేని
సాక్షి, యాదాద్రి/ఘట్‌కేసర్: మహాజన పాదయాత్రతో రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ భయంతోనే ప్రాజెక్టుల బాట వదిలి కులాలకు వరాలు కురిపిస్తుందని విమర్శించారు. మహాజన పాదయాత్ర 152 రోజులుగా 4,080 కిలోమీటర్లు పూర్తి చేసుకుని శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిపక్షాలను ఏకం చేసి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ విధానాలతో తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు. బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేసి నిధు లు కేటాయించకపోగా కులవృత్తులకు ప్రోత్సాహం పేరుతో అమలుకాని వరాలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. ఘట్‌కేసర్‌లో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ వెనకబడిన తరగతుల అభివృద్ధికి తక్షణమే బీసీ సబ్‌ప్లాన్ ను ప్రవేశపెట్టాలని, ప్రజలు పోరాడి తెచ్చు కొన్న రాష్ట్రంలోను దగా పడుతున్నారన్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: రవాణారంగంలోని కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమబోర్డు ను ఏర్పాటు చేయాలని తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.