
మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
సాక్షి, ఎర్రుపాలెం: రాష్ట్రంలోని ప్రజల బతుకులు మారాలంటే బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యపడుతుందని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మధిర బీఎల్‌ఎఫ్ అభ్యర్థి కోటా రాంబాబు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి మండలంలోని మీనవోలు గ్రామంలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థి కోటా రాంబాబుతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలు మాత్రమే గెలవాలని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, దేశంలో బీజేపీ ప్రజలను దగా చేశాయని చెప్పారు. దశాబ్దాలుగా పాలించిన పాలక ప్రభుత్వాలు ప్రజల గోడును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని, పేదలకు సేవలు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి దుస్థితి పోవాలంటే రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. ప్రజలకు మేలు చేసే బీఎల్‌ఎఫ్‌నే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా నాయకులు మాదినేని రమేష్,కోటా అరుణకుమారి, సీపీఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, ఎంపీటీసీలు రామిశెట్టి సుజాత, అనుమోలు ఉషాకిరణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment