బౌండరీల హోరు.. సిక్సర్ల జోరుతో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు క్రీడాభిమానులను హోరేత్తిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా క్రికెట్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో వివిధ జట్ల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ నేడు మండల కేంద్రాలు, గ్రామాలకు సైతం విస్తరించింది. రోజుకు రూ.50లక్షల నుంచి కోటి రూపాయల వరకు పందెం కాస్తున్నట్లు సమాచారం. అయినా పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- త్రిపురారం
ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ద్వారా క్రీడాభిమానులకు కావలసినంత వినోదం లభిస్తుండగా మరో పక్క ఈ క్రికెట్ మ్యాచ్‌లపై జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. విశ్వనీయ సమాచారం మేరకు త్రిపురారం, నిడమనూరు, హాలియా, నాగార్జునసాగర్‌తో పాటు ప్రధాన పట్టణాలైన మిర్యాలగూడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, ప్రాంతాల్లో మూడు మ్యాచ్‌లు ఆరు బెట్టింగ్‌లుగా సాగుతోంది. ఎక్కడికక్కడే లోకల్ బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న పందెం రాయుళ్లు విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా..
హైదరాబాద్, ముంబాయి కేంద్రాలుగా సాగుతున్న బెట్టింగ్‌లు జిల్లా వ్యాప్తంగా దాదాపు రోజుకు 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మేర చేతులు మారుతున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వీరు సగానికిపైగా పనిని ఫోన్లలోనే నడిపిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కుగా మిర్యాలగూడ పట్టణంలో రోజుకు 20 లక్షల రూపాయల మేరకు బెట్టింగ్ సాగుతున్నట్లు వినికిడి. ఇక్కడ ప్రధాన బార్ అండ్ రెస్టారెంట్లనే వేదికలుగా చేసుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు పట్టణంలోని పెద్ద బజార్, డాక్టర్స్ కాలనీ, ప్రధాన హోటళ్లు, మెడికల్ దుకాణాల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు మండలాల్లో బాల్ బాల్‌కూ బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. వెయ్యికి పదివేలు.. పదివేలకు లక్షల అంటూ పందెం కాస్తున్నారు. దీంతో పాటు వరుస విజయాలు సాధిస్తున్న ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, బంగ్లాదేశ్ దేశాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కడుతున్నారు.
పట్టించుకోని పోలీసులు
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శీతకన్ను చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా జోరుగా క్రికెట్ బెట్టింగ్‌లు వ్యవహారం సాగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే గుసగసలు వినబడుతున్నాయి. బెట్టింగ్ వెనుక బడా రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జిల్లాలో ఇప్పటి దాకా ఏ ప్రాంతంలోనూ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు జరిగిన దాఖలాలు లేకపోవడంతో పందెం రాయుళ్లు మరింత విజృంభిస్తున్నారు.
బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్
Published Mon, Mar 2 2015 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement