సాక్షి, హైదరాబాద్: సకల నేరస్తుల సమగ్ర సర్వే కోసం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. నేరస్తుల వివరాలపై సర్వే చేయరాదని డీజీపీ జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపినట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. జనవరి 3న సకల నేరస్తుల సమగ్ర సర్వే కోసం ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసినట్లు ఏజీ చెప్పడంతో.. ఆ సర్వే పేరుతో తమను వేధిస్తున్నారంటూ దాఖలైన రెండు వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌వో గతనెల 19న తనను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఫొటోలు, వేలిముద్రలు తీసుకున్నారని, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ కూడా తనను వేధించారంటూ గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ చిర్రబోన బద్రీనాథ్ యాదవ్, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్‌హెచ్‌ఓ తనను సకల నేరస్తుల సర్వే పేరిట వేధిస్తున్నారని పేర్కొంటూ అబ్దుల్ హఫీజ్ వేరువేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలు సోమవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. గత జనవరి 18న ఒక్కరోజు మాత్రమే సర్వే కోసం డీజీపీ సర్క్యులర్ ఇచ్చారని తెలిపిన ఏజీ.. దాని అమలు నిలిపివేత మెమోను న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయికి అందజేశారు.
డీజీపీ సర్క్యులర్ అమల్లో లేనప్పుడు వ్యాజ్యాలపై విచారణ అవసరమా అని పిటిషనర్లను న్యాయమూర్తి వివరణ కోరారు. పిటిషనర్ల నుంచి పోలీసులు సర్వే పేరుతో సేకరించిన సమాచారాన్ని తిరిగి ఇచ్చేయాలని వారి న్యాయవాదులు కోరగా, దానికి ఏజీ అభ్యంతరం చెప్పారు. భవిష్యత్‌లో సర్వే పేరిట వివరాలు కోరబోమని ఏజీ హామీ ఇచ్చారు. దాంతో రెండు వ్యాజ్యా లపై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇటీవల బద్రీనాథ్ యాదవ్ వేసిన వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు ‘మీ న్యాయవాది పేరు, మీరు వస్తువుల్ని ఎవరి దగ్గర తాకట్టు పెడతారు, మీ ఉంపుడుగత్తె ఎవరు’.. వంటి అనవసర వివరాలు పోలీసులు అడగడంపై హైకోర్టు తప్పుపట్టిన విషయం విదితమే.
సకల నేరస్తుల సర్వే నిలిపివేత
Published Tue, Feb 13 2018 4:43 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment