బీమా.. ఏదీ ధీమా? | Crop insurance not supported farmers | Sakshi
Sakshi News home page

బీమా.. ఏదీ ధీమా?

Published Tue, Dec 15 2015 1:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

బీమా.. ఏదీ ధీమా? - Sakshi

బీమా.. ఏదీ ధీమా?

కరువులో రైతులకు చేయూతనివ్వని పంటల బీమా
* 2014-15 ఖరీఫ్‌లో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం
* తీవ్రంగా నష్టపోయినా నామమాత్రంగా పరిహారం
* రూ. 1,596 కోట్లకు బీమా చేస్తే.. ఇచ్చింది రూ. 77 కోట్లే
* ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బీమా కంపెనీలు
* పరిహారంపై ఏటికేడు రైతుల్లో సన్నగిల్లుతోన్న ఆశలు
* బీమా చేయించడమే దండగ అని భావించే పరిస్థితి
* ప్రభుత్వపరంగానూ అన్నదాతలకు అందని తోడ్పాటు
* ప్రీమియంపై కర్ణాటకలో 90 శాతం రాయితీ...
* రాష్ట్రంలో ఇస్తున్నది 10 శాతమే
 
 సాక్షి, హైదరాబాద్: కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతన్నలకు ‘బీమా’ ధీమా కరువైంది. వర్షాభావంతో పంటలు నష్టపోయినా.. కనీస పరిహారం కూడా అందని దుస్థితి నెలకొంది. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు బీమా కంపెనీల తెంపరితనం కలసి అన్నదాతల కడుపుకొడుతున్నాయి. బీమా కంపెనీలు రైతులు భారీగా చెల్లిస్తున్న ప్రీమియం సొమ్మును దండుకుని.. ఏదో కొద్ది మందికి నామమాత్రపు పరిహారాన్ని విదిలిస్తున్నాయి. చివరికి బీమా చేయించడమే దండగ అని రైతులు భావించే పరిస్థితికి కారణమవుతున్నాయి. చివరికి అటు పంటలూ నష్టపోయి, ఇటు అప్పులూ పెరిగిపోయి ఏం చేయాలో తెలియని ఆవేదనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అందుతున్నది కొంతే: రాష్ట్రంలో పంటల బీమా పథకం రైతులకు ఏమాత్రం చేయూత ఇవ్వడం లేదు. రైతులు చెల్లిస్తున్న ప్రీమియం సొమ్మును మింగేయడానికే బీమా కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు వివిధ పంటలకు వందల కోట్ల రూపాయలకు బీమా చేస్తే... అందుతున్న పరిహారం పదుల కోట్లలోనే ఉండడం గమనార్హం. దీంతో బీమా ప్రీమియం చెల్లించడానికి చాలా మంది రైతులు ముందుకు రావడంలేదు.

 రైతుకు చేయూత ఏదీ?: రాష్ట్రంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం అమలవుతున్నాయి. వీటికోసం రైతులు రెండు రకాలుగా ప్రీమియం చెల్లిస్తారు. కొందరు నేరుగా ప్రీమియం చెల్లిస్తే.. మరికొందరు బ్యాంకు రుణం తీసుకున్నప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయిస్తాయి. ఈ ప్రీమియంలో ప్రభుత్వం 10 శాతం రాయితీ ఇస్తోంది. అదే కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రీమియంపై 90 శాతం రాయితీ ఇస్తుండడం గమనార్హం. అసలు రాష్ట్రంలో చాలా మంది రైతులు పంటల బీమాకు ప్రీమియం చెల్లిస్తున్నా... పంట నష్టపోయినప్పుడు తగిన స్థాయిలో పరిహారం అందడం లేదు. దీంతో రైతులు బీమా చేయించడంపై ఆసక్తి కోల్పోతున్నారు.

 రాష్ట్రంలో ఏటా 55 లక్షల మంది వరకు రైతులు పంటలు వేస్తారు. కానీ బీమా ప్రీమియం చెల్లిస్తున్న వారి సంఖ్య ఏడెనిమిది లక్షలకు మించడం లేదు. 2014-15 ఖరీఫ్‌లో 3.87 లక్షల మంది రైతులు రూ. 1,596.94 కోట్లకు బీమా చేశారు. ఆ ఖరీఫ్ సీజన్‌లో తీవ్రస్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ప్రకటించకపోయినా.. కలెక్టర్లు పంపిన నివేదిక ప్రకారం 300 పైగా మండలాల్లో రైతులు భారీగా నష్టపోయారు. కానీ గత ఏడాది బీమా కంపెనీ నుంచి కేవలం 1.21 లక్షల మంది రైతులకు రూ. 77.22 కోట్ల పరిహారం మాత్రమే మంజూరైంది. దారుణమైన విషయం ఏమిటంటే... గత ఏడాది రైతుల నుంచి పెద్ద సంఖ్యలో బీమా దరఖాస్తులు వచ్చినా... సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేక దాదాపు 10 వేల దరఖాస్తులను వెనక్కి పంపారు. ఆ రైతులెవరూ కనీస బీమా సొమ్ముకు నోచుకోలేదు. బీమా కంపెనీల అధికారులు తమ నిర్లక్ష్యాన్ని బయటకు పొక్కనీయకుండా.. ఆ దరఖాస్తులు సరిగా లేవంటూ సాకులు చూపడంపై విమర్శలు వచ్చాయి. ఇదే నిర్లక్ష్యం గత ఖరీఫ్‌లోనూ కనిపించింది. ఏ సంవత్సరం కూడా రైతులకు పూర్తిస్థాయిలో బీమా పరిహారం చెల్లిస్తున్న దాఖలాలు లేవు.

 రైతుకు భారంగా ప్రీమియం
 బీమా లెక్కలు చాలా చిత్రంగా ఉంటాయి. గ్రామం, మండలం యూనిట్‌గా వివిధ రకాల బీమాలు ఉన్నాయి. ఒక పంట గ్రామం మొత్తం నష్టపోతేనే పరిహారం ఉంటుంది. మరో పంట మండలం మొత్తం నష్టపోతేనే పరిహారం ఉంటుంది. ఇక బీమా ప్రీమియం కూడా రైతులకు భారంగానే ఉంటోంది. ఉదాహరణకు వరి సాగు చేసే రైతు రబీలో ఎకరాకు రూ. 509 ప్రీమియం చెల్లించాలి. ఒక్కో జిల్లాలో ఇది ఒక్కోరకంగా ఉంటుంది. వరంగల్ జిల్లాలో మిరప సాగు చేసే రైతు ఎకరాకు రూ. 1,804 ప్రీమియం చెల్లించాలి.

మరోవైపు ప్రీమియం చెల్లించినా పంట నష్టపోతే పరిహారం దక్కడం లేదన్న ఆందోళన రైతులను వెన్నాడుతోంది. దీంతో 55 లక్షల మంది రైతులు పంటలు వేస్తుంటే... ప్రీమియం చెల్లిస్తున్నవారి సంఖ్య ఏడెనిమిది లక్షలకు మించడం లేదు. ప్రీమియం సొమ్ము చెల్లించడమే దండగగా వారు భావిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న రైతులు కూడా బ్యాంకుల అధికారులను బతిమాలుకుని ప్రీమియం సొమ్మును మినహాయించకుండా చూసుకుంటున్నారు. మరోవైపు ఒకే బీమా కంపెనీకి పంటల బీమా బాధ్యతను అప్పగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఒకే కంపెనీ కాబట్టి ప్రశ్నించే నాథుడే లేకుండా పోయారని, బీమా కంపెనీ గుత్తాధిపత్యం రైతులకు నష్టం కలిగిస్తోందని ఆరోపణలున్నాయి.

 ఐదేళ్లలో రైతులు చేసిన బీమా మొత్తం, పొందిన పరిహారం వివరాలు..
 ఏడాది               రైతులు              బీమా మొత్తం      పొందిన పరిహారం      లబ్ధిపొందిన రైతులు
                                                     (రూ.కోట్లలో)       (రూ.కోట్లలో)
 2010-11            8.88 లక్షలు         2,585.37        25.94            1.06 లక్షలు
 2011-12           11.99 లక్షలు         3,867.9          252.15          4.56 లక్షలు
 2012-13           8.45    లక్షలు        3,810.9        78.99            1.80 లక్షలు
 2013-14           8.41     లక్షలు        3,784.66        32               1.28 లక్షలు
 2014-15(ఖరీఫ్)    3.87 లక్షలు        1,596.94        77.22            1.21 లక్షలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement