లింగంపేట: నకిలీ పట్టా పుస్తకాల బాగోతం బయటపడుతోంది. బోగస్ పట్టాలు చూపి పంట రుణాలు పొందిన రైతుల గుట్టురట్టు కానుంది. అక్రమాలకు పాల్పడిన వారి అంతు చూడడానికి రంగం సిద్ధమైంది. ఒక్క లింగంపేట మండలంలోనే నకిలీ పాసు పుస్తకాలతో కోటి రూపాయలకు పైగా పంట రుణాలను పొందినట్లు అధికారులు అంచ నాకు వచ్చారు. తవ్విన కొద్దీ నకిలీలు బయటపడుతున్నాయి.
రికార్డుల పరిశీలన
పాస్ పుస్తకాలలో నమోదు చేసిన వ్యవసాయ భూముల సర్వే నంబర్లను వన్‌బీ రికార్డులలో ఉందాలేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులు డబ్బులకు ఆశపడి తహసీల్దార్, ఆర్డీఓ స్థాయి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేశారు. ఒక్కో రైతు నుంచి రూ. ఐదు వేల నుంచి రూ. పది వేలు దండుకుని వీటిని వారికి అంటగట్టారు. నకిలీ పుస్తకాలతో కొందరు దర్జాగా బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. లింగంపేట మండలంలో సుమారు మూడు వేలకు పైగా నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు తేలింది.
మచ్చుకు కొన్ని
మెంగారం గ్రామానికి చెందిన ఓ మహిళ భూమి లేకపోయినా సర్వే నంబర్194/ఆ, 253/1/1 (పాస్ పుస్తకం నంబర్ 325364, ఖాతా నంబర్ 5033తో స్థానిక ఇండి యన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ. 83 వేల పంట రుణం పొందినట్లు అధికారులు గుర్తించారు. అయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు ఒకే పట్టా నంబర్, ఒకే పాస్ పుస్తకంపై నాలుగు సార్లు పంట రుణం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
రుణమాఫీ తర్వాత
2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ చేసి తిరిగి రుణాలు ఇవ్వడంతో, రుణాలు పొందడానికి రైతులు పోటీ పడ్డారు. ఆ సమయంలోనే కొ ందరు రెవెన్యూ అధికారులు,సిబ్బంది కలిసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. లింగంపేట మండలంలోని నల్లమడుగు, శెట్పల్లిసంగారెడ్డి, లింగంపేట,సింగిల్ వి ండోలతో పాటు స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందినట్లు తెలిసింది.
మండలంలోని ముంబాజాపేట తండా, కొండాపూర్ తండా, ముంబాజీపేట, భవానీపేట గ్రామాలకు చెందిన కొందరు ఇలా రూ. 20 లక్షల పంట రుణాలను పొందినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు రైతులకు అసలు వ్యవసాయ భూమి లేక పోవడం, మరికొందరికి పట్టానంబర్లు లేకపోవడం,మరికొందరివి ఖాతా నం బర్లు లేకపోవడంతో అధికారులు రాత్రింబవళ్లు పరిశీలన చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో నకిలీల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది.
పంట రుణాలు నకి‘లీలలు’
Published Mon, Sep 29 2014 2:29 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement