records observation
-
ఇక గంట గంటకూ పాతాళగంగ లెక్క
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఒక ప్రాంతంలో భూగర్భ జలమట్టం లెక్కించాలంటే భూగర్భజల శాఖ అధికారులు స్వయంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైజోమీటర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి నెల 15వ తేదీ తర్వాత పైజోమీటర్ల వద్దకు వెళ్లి ఆ నెలలో నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలు రికార్డు చేస్తున్నారు. అయితే.. ఇకపై ఈ తిప్పలు తప్పను న్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయంలో కూర్చునే ఆయా ప్రాంతాల్లో భూగర్భజల మట్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వెసులు బాటు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం పైజోమీటర్లకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ల (డీడబ్ల్యూఎల్‌ఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రతి గంటకు ఏ స్థాయిలో నీటి మట్టం ఉందో కూడా తెలుసుకునే వీలు కలిగింది. వెబ్‌సైట్‌తో అనుసంధానం : పైజోమీటర్లకు బిగించే డబ్ల్యూఎల్ఆర్లను ప్రత్యేక వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో ఈ వెబ్సైట్ ద్వారా అవసరం ఉన్న ప్రాంతాల్లోని పైజోమీటర్కు సంబంధించిన భూగర్భ నీటి మట్టం వివరాలను ఎప్పటికప్పుడు పొందవచ్చు. వీటి పనితీరుపై ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న హైడ్రాల జిస్టులు, జియాలజిస్టులకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు భూగర్భజల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లలో కట్టుదిట్టమైన రక్షణ ఉన్న వాటికి డీడబ్ల్యూఎల్ఆర్లను అమర్చుతోంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 240 పైజోమీటర్లకు ఈ రికార్డర్లను అమర్చారు. రెండో విడతలో పెద్ద సంఖ్యలో ఈ రికార్డర్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు సైతం తీసుకున్నారు. ఒక్కో మండలానికి కనీసం రెండు చొప్పున రికార్డర్లను అమర్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. బోర్ల ద్వారా నీటి వాడకం తెలిసిపోతుంది డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ల ద్వారా ఏఏ ప్రాంతాల్లో బోర్లు నడుస్తున్నాయనే సమాచారం సైతం అధికారులకు తెలిసిపోతుంది. ఈ సమాచారం అటు విద్యుత్‌శాఖకు కూడా ఉపయోగపడుతుంది. వారు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించుకునేందుకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. పథకం పేరు : నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లు : 966 డీడబ్ల్యూఎల్ఆర్లు అమర్చిన ఫీజోమీటర్లు : 240 -
పరిగి జీపీని సందర్శించిన డీఎల్పీఓ
గ్రామ పంచాయతీలో రికార్డుల పరిశీలన పరిగి: గ్రామ పంచాయతీల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని చేవెళ్ల డీఎల్పీఓ రాణిబాయి అన్నారు. శుక్రవారం ఆమె పరిగి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. గతంలో వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చానని ఆమె తెలిపారు. పలు అంశాల్లో ఆమె సర్పంచ్ విజయమాలతో చర్చించారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే పూడూరు మండల ఈఓపీఆర్డీ విచారణ జరిపి నివేదిక సమర్పించినందున అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. పంచాయతీల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోయిన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజల విన్నపాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు, ప్రధానంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పంట రుణాలు నకి‘లీలలు’
లింగంపేట: నకిలీ పట్టా పుస్తకాల బాగోతం బయటపడుతోంది. బోగస్ పట్టాలు చూపి పంట రుణాలు పొందిన రైతుల గుట్టురట్టు కానుంది. అక్రమాలకు పాల్పడిన వారి అంతు చూడడానికి రంగం సిద్ధమైంది. ఒక్క లింగంపేట మండలంలోనే నకిలీ పాసు పుస్తకాలతో కోటి రూపాయలకు పైగా పంట రుణాలను పొందినట్లు అధికారులు అంచ నాకు వచ్చారు. తవ్విన కొద్దీ నకిలీలు బయటపడుతున్నాయి. రికార్డుల పరిశీలన పాస్ పుస్తకాలలో నమోదు చేసిన వ్యవసాయ భూముల సర్వే నంబర్లను వన్‌బీ రికార్డులలో ఉందాలేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులు డబ్బులకు ఆశపడి తహసీల్దార్, ఆర్డీఓ స్థాయి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేశారు. ఒక్కో రైతు నుంచి రూ. ఐదు వేల నుంచి రూ. పది వేలు దండుకుని వీటిని వారికి అంటగట్టారు. నకిలీ పుస్తకాలతో కొందరు దర్జాగా బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. లింగంపేట మండలంలో సుమారు మూడు వేలకు పైగా నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు తేలింది. మచ్చుకు కొన్ని మెంగారం గ్రామానికి చెందిన ఓ మహిళ భూమి లేకపోయినా సర్వే నంబర్194/ఆ, 253/1/1 (పాస్ పుస్తకం నంబర్ 325364, ఖాతా నంబర్ 5033తో స్థానిక ఇండి యన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ. 83 వేల పంట రుణం పొందినట్లు అధికారులు గుర్తించారు. అయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు ఒకే పట్టా నంబర్, ఒకే పాస్ పుస్తకంపై నాలుగు సార్లు పంట రుణం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీ తర్వాత 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ చేసి తిరిగి రుణాలు ఇవ్వడంతో, రుణాలు పొందడానికి రైతులు పోటీ పడ్డారు. ఆ సమయంలోనే కొ ందరు రెవెన్యూ అధికారులు,సిబ్బంది కలిసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. లింగంపేట మండలంలోని నల్లమడుగు, శెట్పల్లిసంగారెడ్డి, లింగంపేట,సింగిల్ వి ండోలతో పాటు స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందినట్లు తెలిసింది. మండలంలోని ముంబాజాపేట తండా, కొండాపూర్ తండా, ముంబాజీపేట, భవానీపేట గ్రామాలకు చెందిన కొందరు ఇలా రూ. 20 లక్షల పంట రుణాలను పొందినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు రైతులకు అసలు వ్యవసాయ భూమి లేక పోవడం, మరికొందరికి పట్టానంబర్లు లేకపోవడం,మరికొందరివి ఖాతా నం బర్లు లేకపోవడంతో అధికారులు రాత్రింబవళ్లు పరిశీలన చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో నకిలీల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది.