వృద్ధురాలి గొంతు కోసి ఆభరణాలతో పరార్
నాగోల్‌లో సంఘటన
హైదరాబాద్: బంధువని ఆత్మీయంగా ఆహ్వానించి అన్నం పెట్టిన ఓ వృద్ధురాలి గొంతునే కోసి బంగారు నగలతో ఉడాయించాడో దుర్మార్గుడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొమ్మూరి దినేశ్‌రెడ్డి, శిరీషలు నగరానికి వచ్చి నాగోలు జైపురికాలనీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. దినేశ్‌రెడ్డి తల్లి సువర్ణ (60) కూడా వీరితో పాటే ఉంటోంది.
దినేశ్‌రెడ్డి మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా శిరీష చెంగిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. గురువారం భార్యాభర్తలు ఇద్దరు విధులకు వెళ్లారు. దినేశ్‌రెడ్డి కుమారుడు స్కూల్‌కు వెళ్లగా ఇంట్లో కూతురు, సువర్ణ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో శిరీష పెద్దమ్మ కుమారుడు శ్యామ్ ఇంటికి వచ్చాడు. సువర్ణ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అన్నం పెట్టింది. అనంతరం వెళ్లి నిద్ర పోతుండగా శ్యామ్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని బెదిరించాడు.
దీనికి సువర్ణ నిరాకరించడంతో శ్యామ్ కత్తితో గొంతు కోసి ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు, చేతికున్న 4 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలను తీసుకుని పారిపోయాడు. వెంటనే దినేశ్‌రెడ్డి కూతురు, సువర్ణ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం నాగోలులోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. దినేశ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.