సరుకులు పక్కదారి పట్టకుండా జీపీఎస్ అమలు: ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల సరుకులు పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలకు కసరత్తు చేస్తోంది. రవాణా కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేసింది. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లు, అక్కడ్నుంచి రేషన్ షాపులకు సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం సరుకు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. రోజూ ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, వాటిని అరికట్టడానికి ఇకపై సరుకు రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే రైస్‌మిల్లర్లు, రేషన్, కిరోసిన్ డీలర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించామని, రవాణా చేసే వారి ప్రమేయం లేకుండా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని తేలిందని స్పష్టం చేశారు.
సరుకు రవాణా పూర్తరుునప్పటికీ వాహనాలను అధికారుల అనుమతి లేకుండా జిల్లా పరిధి దాటకూడదని సూచించారు. జీపీఎస్‌తో కాంట్రాక్టర్ల తప్పులన్నీ రికార్డు అవుతున్నాయని, ప్రతి వాహనానికి శాశ్వతంగా ఒకే సెల్‌ఫోన్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని, తమ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కాంట్రాక్టర్లు తెలుసుకునేలా ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వనున్నామని కమిషనర్ తెలిపారు. ఇకపై కాంట్రాక్టర్ల లావాదేవీలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే చేస్తామని స్పష్టం చేశారు. తమ కాంట్రాక్ట్ గడువును గతంలో మాదిరిగా రెండేళ్లకు పెంచాలని కాంట్రాక్టర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తానని కమిషనర్ అన్నారు.