సాక్షి, హైదరాబాద్: వారం కాదు.. నెల కాదు.. ఏడాది కాదు... కేవలం 24 గంటలు...ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా ఒక్క రోజులో పెట్టుబడి రెట్టింపు అవుతుందట! ఇలా చెప్పిన ఉత్తరాది వ్యక్తులు నగరవాసికి రూ.11 లక్షల టోకరా వేశారు. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వస్తున్న వడ్డీతో జీవిస్తున్న అతను వాటిపైనే రుణం తీసుకుని సైబర్ నేరగాళ్లకు అప్పగించాడు. చివరకు మోసపోయానని గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదైంది.
ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. నగరానికి చెందిన మరియాదాస్ ఫ్రాన్సిస్ జయరాజ్ గతంలో ఓ చిన్న తరహా పరిశ్రమ నిర్వహించారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని కొన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ప్రస్తుతం వాటిపై వచ్చే వడ్డీతో జీవించడంతో పాటు కొన్ని రకాలైన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులూ పెట్టారు. ఆగస్టు 14న అతడికి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి.
సూరత్‌కు చెందిన క్రిస్టోఫర్, ముంబై వాసి షా పేరుతో పరిచయం చేసుకున్న వారు జయరాజ్‌ను క్రిస్టల్స్ ట్రేడర్స్ ద్వారా ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని కోరారు. రూ.12.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కేవలం 24 గంటల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందంటూ ఆశపెట్టారు. ఆసక్తి చూపిన జయరాజ్ తన వద్ద అంత మొత్తం లేదని, ఎఫ్‌డీలపై రూ.10 లక్షల వరకు మాత్రమే రుణం వస్తుందని చెప్పాడు. అనేక బేరసారాల తర్వాత ఆ మొత్తం పెట్టుబడిగా పెట్టడానికి సైబర్ నేరగాళ్లు అంగీకరించారు.
తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.లక్ష చెల్లించాలని, ఆపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో జయరాజ్ అందుకు సమ్మతించాడు. సైబర్ నేరగాళ్లు వివరాలు అందించిన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా క్రిస్టల్ ట్రేడర్స్ పేరుతోనే ఉంది. జయరాజ్ ఆగస్టు 18న రూ.లక్ష, 28న రూ.10 లక్షలు ఆ ఖాతాలో డిపాజిట్ చేశాడు. మోసగాళ్లు చెప్పినట్లు 24 గంటలు దాటిన తర్వాత వారికి ఫోన్ చేయగా, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలా నెల రోజులైనా ఎలాంటి ఫలితం లేకపోవడంతో జయరాజ్ గురువారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ బాధితుడు నగదు డిపాజిట్ చేసిన ఖాతా గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమికంగా ఇది మెట్రో నగరాల్లో ఉంటున్న నైజీరియన్లు చేసిన పనిగా అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment