సంతకాలు చేయించుకొని.. రూ.60 లక్షలు స్వాహా | Cyber Criminals Tokara for a retired government employee | Sakshi
Sakshi News home page

20 లక్షల రుణమంటూ 60 లక్షలు స్వాహా

Published Wed, Oct 11 2017 1:34 AM | Last Updated on Wed, Oct 11 2017 6:57 AM

Cyber Criminals Tokara for a retired government employee

సాక్షి, హైదరాబాద్‌: రుణంపై వడ్డీ అస్సలే లేదు... వాయిదాలు సైతం ఏడాది తర్వాత నుంచి చెల్లించవచ్చు... అంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ ఆ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిని నిండా ముంచింది. ఆయన పదవీ విరమణకు సంబంధించిన బెనిఫిట్స్‌తో పాటు అమెరికా లో ఉన్న కుమారుడు సంపాదించిందీ సైబర్‌ నేరగాళ్ల పరం చేశారు. దీనిపై నారాయణగూడ ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం మంగళవారం సీసీఎస్‌ అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయింది.

ఇంటికే వచ్చి సంతకాలు చేయించుకుని...
హైదరాబాద్‌ నారాయణగూడ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్‌ అబ్దుల్‌ ఫారూఖ్‌కు 2014లో.. ఎలాంటి వడ్డీ లేకుండా రూ.20 లక్షలు రుణం ఇస్తామంటూ ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. దీని వాయిదాలు సైతం ఏడాది తర్వాత నుంచి చెల్లించవచ్చని మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం అని చెప్పడంతో ఆశపడిన ఫారూఖ్‌ తనకు రుణం కావాలని చెప్పాడు. ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.లక్ష చెల్లించమంటూ బ్యాంకు ఖాతాలో నేరగాళ్లు డిపాజిట్‌ చేయించుకున్నారు. రుణం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంజూరు చేస్తోందని, ఫారూఖ్‌ ఇంటికి వచ్చి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. వెళ్తూవెళ్తూ మరో రూ.లక్ష పట్టుకెళ్లారు.

ప్రధాని మోదీ పేరు చెప్పి మరోసారి...
ఇలా ఫారూఖ్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.3.4 లక్షలు స్వాహా చేసిన తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఆపై ఫారూఖ్‌కు ఫోన్‌ చేసిన అదే ముఠాకు చెందిన వ్యక్తి తాను ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ విభాగం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం మీరు సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.3.4 లక్షలు నష్టపోయారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.

ఇలా మోసపోయిన వారి డబ్బు తిరిగి ఇప్పిం చడానికి ప్రధాని మోదీ ఓ కొత్త పథకం ప్రారం భించారంటూ ఎర వేశారు. అలా చేయడానికి ప్రాసెసింగ్‌ చార్జీలు, యూనియన్‌ బ్యాంక్‌లో కొత్త ఖాతా తెరవాలని, ఇతర పన్నుల పేర్లు చెప్పి దాదాపు ఏడాది పాటు (2016 డిసెంబర్‌ వరకు) రూ.58.6 లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నారు. బాధితుడు పదవీ విరమణ తర్వాత తనకు వచ్చిన బెనిఫిట్స్‌తో పాటు అమెరికాలో ఉన్న కుమారుడు నెలనెలా పంపిస్తున్న సంపాదన సైతం సైబర్‌ నేరగాళ్ల పరం చేశాడు.


కుమారుడు ఇల్లు కొందామనుకోగా...
తాను మోసపోయానని తెలిసినప్పటికీ... పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేశాడు. ఈ ఏడాది జూలైలో అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు నగరానికి తిరిగి వచ్చాడు. ఇన్నాళ్లు తాను పంపిన డబ్బుతో ఇల్లు కొందామని భావించాడు.

ఈ నేపథ్యంలో అసలు విషయం ఫారూఖ్‌ బయటపెట్టాడు. దీంతో కుమారుడి ఒత్తిడి మేరకు ఫారూఖ్‌ నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సైబర్‌ నేరం కావడంతో దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్‌ అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బదిలీ చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు.

ఆ ఖాతాల్లో ఉంది రూ.1,100 మాత్రమే...
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫారూఖ్‌ డబ్బు డిపాజిట్‌ చేసిన మూడు బ్యాంకు ఖాతాలపై దృష్టిపెట్టారు. ఢిల్లీ, ఘజియాబాద్‌ల్లో ఉన్న వీటిని ఫ్రీజ్‌ చేయిస్తే బాధితుడికి కొంత మొత్తమైనా దక్కుతుందని భావించారు. బ్యాంకు అధికారులకు లేఖ రాసిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయించారు.

అయితే ఆ ఖాతాల్లో రూ.1,100 మాత్రమే ఉన్నాయని తేలింది. దుండగుడు వినియోగించిన సిమ్‌కార్డులన్నీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవిగా స్పష్టమైంది. ఓ నంబర్‌ మాత్రం కొన్నాళ్ల పాటు కూకట్‌పల్లి సమీపంలోని ఆల్విన్‌కాలనీలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫారూఖ్‌ వద్ద సంతకాలకు వచ్చిన సైబర్‌ నేరగాళ్లు అక్కడే ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement