సాక్షి, నంద్యాల: తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనతో నంద్యాలలో భగ్గుమన్న విబేధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరూ సర్దుకుపోవాలని సూచించినా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అలక వీడకపోవడంతో మాజీ మంత్రి ఫరూక్ వర్గంలో అయోమయం నెలకొంది. నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గతేడాది నవంబర్ వరకు ఉన్నారు. టికెట్ తనకే ఇస్తారన్న ఆశతో నాలుగున్నరేళ్ల పాటు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, ఆర్థికంగానూ నష్టపోయారు.
అయితే కనీస సమాచారం ఇవ్వకుండా ఆయన స్థానంలో మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కి ఇన్‌చార్జిగా టీడీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి బ్రహ్మం వర్గం స్తబ్ధుగా ఉంటోంది. కొత్త ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఫరూక్‌కు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. అయినప్పటికీ చివరిలోపు టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో భూమా బ్రహ్మం ఉంటూ వచ్చారు. వ్యక్తిగతంగా కార్యక్రమాలకు హాజరవుతూ తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే భూమా బ్రహ్మానికి షాక్ ఇస్తూ టీడీపీ నంద్యాల అభ్యర్థిగా ఫరూక్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో ఖరారు చేయడంతో భూమా వర్గం ఒక్కసారిగా కంగుతింది.
బాబు మాట బేఖాతర్..
నంద్యాల టికెట్ ఫరూక్‌కి ఇస్తున్నట్లు ప్రకటించడంతో భూమా బ్రహ్మం పది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదు. దీంతో మూడు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి ఇద్దరు కలిసి పనిచేయాలని భూమా బ్రహ్మానికి సూచించారు. అయినా బ్రహ్మం అలక వీడలేదు. స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వకపోవడంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు. దీంతో మాజీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఫరూక్, భూమా బ్రహ్మాన్ని అనంతపురం పిలిపించుకుని మాట్లాడారు. అధికారంలోకి వస్తే తగిన పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు.
అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడతో బ్రహ్మం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోకేశ్‌తో మాట్లాడిన అనంతరం ఎలాంటి ప్రకటన చేయకుండా నంద్యాలకు రాకుండా నేరుగా హైదరాబాద్‌కి వెళ్లిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భూమా, ఫరూక్ ఎడమొహం, పెడ మొహంగా ఉండటంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వెంట నడవాలో లేక నాలుగున్నర్రేళ్ల పాటు తమకు అండగా ఉన్న నేత వెంట నడవాలో తెలియక డైలమాలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment