సైబర్‌మిత్ర.. ఇది మీ ఫ్రెండ్‌ ! | Cyberabad Police Cyber Mitra Awareness Drive For Students | Sakshi
Sakshi News home page

సైబర్‌మిత్ర.. ఇది మీ ఫ్రెండ్‌ !

Published Sun, Sep 29 2019 2:01 AM | Last Updated on Sun, Sep 29 2019 4:55 AM

Cyberabad Police Cyber Mitra Awareness Drive For Students - Sakshi

12-9-2015..
బీటెక్‌ చదివే మాజీద్‌ అమ్మాయి పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీతో అకౌం ట్‌ తెరిచాడు. అమ్మాయినని నమ్మిస్తూ చాటిం గ్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి వ్యక్తిగత వివరాలను సేకరించడంతోపాటు ఫొటో లు సేకరించి నగ్నంగా మార్చి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించడం వరకు వెళ్లాడు. అవసరానికి డబ్బులు, లేదంటే లైంగిక వాంఛ తీర్చాలని వేధించేవాడు. నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపాలని మనోవేదనకు గురిచేశాడు. ఇలా దాదాపు 200 మంది విద్యార్థినులను సోషల్‌ మీడియాలో వేధించినట్టు సైబరాబాద్‌ పోలీసుల విచారణలో తేలింది. 

9-8-2019..
పదో తరగతి విద్యార్థినికి పూర్వ పాఠశాలకు చెందిన ఓ సహచరుడు ఫేస్‌బుక్‌ ఐడీ ద్వారా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలుసుకుంటూ ఆమెను ఆకర్షించాడు. చివరకు తాను ప్రేమిస్తున్నానని చెప్పడంతో అప్పటి నుంచి ఆమె చాట్‌ చేయడం మానేసింది. దీంతో రగిలి పోయిన అతడు ‘నీ ఫొటోలు అసభ్యకరంగా మార్చి సోషల్‌ మీడియాలో పెడతాను’అంటూ బెదిరించాడు. ఇలా కొన్నినెలలపాటు మానసిక క్షోభ అనుభవించిన బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని అరెస్టు చేశారు. 

...ఇలా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసి వేధింపులకు గురవుతున్న కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాఠశాల విద్యార్థులే తెలిసీతెలియని వయస్సులో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే సెల్‌ఫోన్‌ లాగేసుకుంటారని కొందరు, ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచక నిందితులు అడిగిన డబ్బులను ఇంట్లో నుంచి తస్కరించి ఇస్తున్నారు మరికొందరు... బయటకు తెలిస్తే నలుగురిలో చులకన అవుతామన్న భావనలో నిందితుల కోర్కెలకు సరెండర్‌ అవుతున్నవారు ఇంకొందరు... ఇలా తెలిసీ తెలియని వయస్సులో పెద్ద పొరపాట్లు చేసుకుంటూ జీవితాలనే బలి చేసుకుంటున్నారు.

చివరకు తల్లిదండ్రులే ఇంట్లో అమ్మాయిల చురుగ్గా ఉండకపోవటాన్ని గమనించి ఏమీ జరిగిందని గుచ్చిగుచ్చి అడిగితేనే ఈ వేధింపులు తెలుస్తున్నాయని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. మీడియా, పత్రికల ద్వారా ఎంత ప్రచారం చేస్తున్నా ఇవీ ఆగకపోవడంతో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఏడు నుంచి పదో తరగతి పాఠశాల విద్యార్థినులకు సోషల్‌ మీడియా ఉపయోగించే విధానంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘సైబర్‌ మిత్ర’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. 

ప్రతి శనివారం బోధన...
ఇప్పటికే ట్రాఫిక్‌ విషయంలో సైబరాబాద్‌ పోలీసులకు వలంటీర్ల ద్వారా సహకారం అందిస్తున్న సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ)ను ఈ సైబర్‌మిత్ర కార్యక్రమంలోనూ భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందులో 500 కంపెనీలు భాగస్వాములుగా ఉన్నా యి. ఆయా కంపెనీల్లో ఆసక్తి ఉన్న ఐటీ ఉద్యోగులు ప్రతి శనివారం దాదాపు ఓ 3 గంటలపాటు తమ, తమ పరిధిల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ‘సైబర్‌ వేధింపులు–నేరాలు’అనే అంశంపై బోధించనున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో మారుతున్న నేరాల ట్రెండ్‌ను సబ్జెక్ట్‌గా రెడీ చేసి విద్యార్థులకు అవగాహన కలిగించనున్నారు. 

అకుంఠిత సేవాభావ వలంటీర్లతో మార్పు తీసుకొస్తాం...
ఎస్‌సీఎస్‌సీ సహకారంతో సైబర్‌మిత్రకు వలంటీర్లను ఎన్నుకునే ప్రక్రియను మొదలెడతాం. దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేశాకే వారి అభిరుచికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కలిగించడం ద్వారా క్లిష్టపరిస్థితుల్లో వారు సరైన నిర్ణయం తీసుకునేలా బోధనలు ఉంటాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల మార్గదర్శనంలో వలంటీర్లు ప్రతి శనివారం వారి వారి ప్రాంతాల్లోని పాఠశాల్లో ఓ 3 గంటపాటు క్లాస్‌లు తీసుకుంటారు. కొన్ని రోజుల్లోనే సైబర్‌ మిత్ర ప్రారంభించబోతున్నాం.      
– వీసీ సజ్జనార్, సీపీ సైబరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement