భారీ పేలుడు.. ఒకరి మృతి
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలిన సిలిండర్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఆటోకు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాచిగూడలోని సంజయ్‌గాంధీనగర్ బస్తీలో మూసీ నది ఒడ్డున కొన్నేళ్ల నుంచి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. సబ్సిడీ ధరపై సరఫరా అయ్యే ఎల్‌పీజీ వంట గ్యాస్ సిలిండర్లను ఇక్కడికి అక్రమంగా తరలించి.. ఇక్కడ చిన్న సిలిండర్లలో, ప్యాసింజర్ ఆటోల్లో నింపుతుంటారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 8 గంటలకు పెద్ద సిలిండర్‌లోని గ్యాస్‌ను చిన్న సిలిండర్‌లోకి రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో అక్కడే ఉన్న నరేందర్(19) అలియాస్ నాని అక్కడికక్కడే చనిపోయాడు. నల్లగొండ జిల్లా మన్సాన్‌పల్లికి చెందిన నరేందర్ నింబోలిఅడ్డలోని ఎస్‌సీ హాస్టల్‌లో ఉంటూ రామంతాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిలో తుయుష్ (30)ను కిమ్స్ ఆసుపత్రికి, అజీజ్ (20)ను షరాఫ్ ఆసుపత్రికి తరలించారు. ఎన్.నరేందర్(30), టైలర్ శంకర్(40), శివం(20), కిరణ్(19)లు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొహమ్మద్ ఖాదిర్(17), మొహమ్మద్ రహీమ్(10)లు స్థానిక వుడ్‌లాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు సందర్శించారు.
కిషన్‌రెడ్డి వెళ్లిన కాసేపటికే..
సిలిండర్ల నుంచి గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తుండగా మొదట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్దసంఖ్యలో స్థానికులతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చారు. మంటలను అదుపు చేస్తుండగానే కిషన్‌రెడ్డి ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కొన్ని సెకన్లకే గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో ప్రమాద స్థలానికి వచ్చిన విద్యార్థి నరేందర్ శకలాలు తగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
కాచిగూడలోని అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో చోటుచేసుకున్న పేలుడుపై ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సంఘటనాస్థలానికి వెళ్లి, బాధితులకు సహాయ సహకారాలను అందజేయాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. పేలుళ్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.