హైదరాబాద్: నిస్వార్థం, సేవాతత్పరతతో ప్రపం చాన్ని గెలవొచ్చని బ్రహ్మకుమారీస్ చీఫ్, రాజయోగిని దాదీ జానకీ అన్నారు. హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఆమె ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ప్రతి వ్యక్తి సింపుల్‌గా ఉంటూనే శాంపిల్‌గా ఉండగలిగితే (హర్ ఆద్మీ ‘సింపుల్’రహెతే హువే ‘శాంపిల్’బన్‌నా హై) ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వగలిగే వారమవుతాం’అని అన్నారు. ప్రతి వ్యక్తి మధురత, నమ్రత, స్వచ్ఛత, ధీరత, విధేయత అనే ఐదు ప్రధాన అంశాలను గుర్తించి ముందుకు నడిస్తే అన్నింటా విజయం సాధ్యమేనన్నారు.
‘బ్రహ్మబాబా ఎంతోమంది పేర్ల ను మార్చినప్పటికీ నా పేరు జానకీ అని, అందులో జాన్ కీ ఉందని అందుకే నీవు జానకీగానే ఉండాలని సూచించారు’అని ఆమె గుర్తు చేశారు. బాబా సూచనతో నా కర్తవ్యం అర్థమైందన్నారు. మనం ఏ పనిచేసినా అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించవద్దని, అన్ని పనులు చేయడమే మనం అలవర్చుకోవాలన్నారు. పరమేశ్వరుడే పరమాత్మ అని, అతనిలోనే తల్లి, తండ్రి, సద్గురు ఉన్నాడని, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటేనే మనం సుఖజీవనాన్ని సాగిస్తామని చెప్పారు. శాంతి ప్రధాత భగవంతుడు మాత్రమేనని, వారితో సంబంధం ఏర్పర్చుకున్న ప్రతి ఒక్కరికీ ఇది లభ్యమ వ్వగలదన్నారు.
సుఖాన్ని ఎలా పొందడం.. ఎలా పంచడం.. అనే విషయాలను పూర్తిగా గ్రహించాలన్నారు. ప్రకృతితో మమేకమయితే అన్ని అంశాలు గ్రహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్‌సీబీసీ) మాజీచైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, శాట్స్ వీసీ, ఎండీ దినకర్‌బాబు, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జోనల్ ఇన్‌చార్జి సంతోష్ దీదీ, రాజయోగి మృత్యుంజయ, శాంతిసరోవర్ డైరెక్టర్ కులదీప్ దీదీ, తెలంగాణ, ఏపీలకు చెందిన బ్రహ్మకుమారీస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ‘ఇన్నర్ స్పేస్’ప్రారంభం
హైదరాబాద్ బ్రహ్మకుమారీస్ సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించిన ‘ఇన్నర్ స్పేస్’భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ సమక్షంలో దాదీ జానకీ ప్రారంభించారు. ఆధునిక ప్రపంచానికి ఆధునిక తరహాలో ఆధ్యాత్మిక చింతన కలగచేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందించారు.
ముఖ్యంగా యువతలో ఒక చైతన్య స్పూర్తిని ఉత్సాహన్ని అందించే దిశగా ఈ సెంటర్‌లో మెడిటేషన్‌రూమ్, ఆర్ట్‌గ్యాలరీ, 3ఎం(మైండ్, మ్యాటర్, మెడిటేషన్), 3ఎస్( సైనర్జీ,సైన్స్, స్పిరిచువ్యాలిటీ)వంటి సిద్ధాంతాలతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుముందు నగరంలోనే అతిపెద్ద బ్రహ్మకుమారీస్ సంస్థ పతాకాన్ని దాదీ జానకీ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా జైన్ హెరిటేజ్ విద్యార్థులు రూపొందించిన దశావతారాల నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment