brahmakumaries
-
వివక్షకు తావులేని వ్యవస్థ కావాలి: ప్రధాని
న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలు, ప్రగతి శీల నిర్ణయాలతో ఎలాంటి వివక్షలకు తావులేని వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో గురువారం ‘స్వర్ణిమ్ భారత్ కే ఓర్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఎప్పటికప్పుడు దానిని ఎదుర్కొంటూ ప్రపంచం దృష్టిలో మన దేశ ముఖ చిత్రాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా మహిళలను ఇంకా అంధకారంలోనే ఉంచిన కాలంలో మన దేశం మాత్రం దేవతల్లా పూజించిందని గుర్తు చేశారు. ప్రతి భారతీయుని గుండెలో జ్ఞానజ్యోతిని వెలిగించాలని, అప్పుడే దేశం ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని ఆకాంక్షించారు. -
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది ఇక లేరు
జైపూర్: బ్రహ్మకుమారీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 93 ఏళ్ళ రాజయోగిని దాది హృదయ్ మోహిని గురువారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. గత పదిహేను రోజులుగా అనారోగ్య కారణాలతో ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో మోహిని చికిత్స పొందుతున్నారని ఆధ్యాత్మిక సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. బ్రహ్మకుమారీస్ మాజీ చీఫ్ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత మోహినిని చీఫ్‌గా నియమించారు. అబు రోడ్‌లోని బ్రహ్మకుమారీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మోహిని భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్టు వారు తెలిపారు. మార్చి 13న మోహిని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. రాజయోగిని దాది గుల్జార్ ఆకా హృదయ మోహిని ప్రజాపీఠ బ్రహ్మకుమారీస్ ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ప్రధాన పాలనాధికారి. దాదా లేఖ్‌రాజ్(ఆ తరువాత బ్రహ్మ బాబాగా పేరు మార్చుకున్నారు) స్థాపించిన ‘ఓం నివాస్’ అనే బోర్డింగ్ స్కూల్లో 1936లో ఎనిమిదేళ్ల వయసులోనే దాది గుల్జార్ యజ్ఞ(సంస్థ)లో దాది హృదయ మోహిని చేరారు. చిన్న వయస్సులోనే ఎంతో అనుభవాన్ని ఆర్జించిన దాది మోహిని, ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దాది మోహిని ఆధ్యాత్మిక, బోధనా విలువలకు పెట్టిందిపేరు. అతిచిన్న వయస్సు నుంచే ఆమె చేసిన సేవ, చూపిన త్యాగనిరతి దాది మోహినిని ఇప్పుుడు అత్యున్నత స్థానంలో నిలిపింది. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి. అనేక దేశాల ఆహ్వానంమేరకు దాది మోహిని తూర్పునుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేసియా, ఇండోనేíసియా, శ్రీలంక, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, హాలాండ్, పోలండ్, రష్యా తదితర దేశాలెన్నింటికో వెళ్ళి తన బోధనలను వినిపించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫిలాసఫీ, రాజ్యోగ లాంటి అనేక అంశాల్లో ఆమె అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. -
మౌంట్‌అబూలో చిక్కుకున్న బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో చిక్కుకుపోయారు. వీరిలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలతో పాటు తెలంగాణలోని వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు. వీరు మార్చి 13న బయల్దేరి 17కి మౌంట్ అబూ చేరుకున్నారు. మార్చి 22, 23 తేదీల్లో రైళ్లలో తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇంతలో లాక్డౌన్ వల్ల రైళ్లు రద్దవడంతో అక్కడే ఉండిపోయారు. అందులో సగం మంది బ్రహ్మకుమారీలు కాగా మిగిలిన వారు రైతులు. నెల రోజులుగా మౌంట్ అబూలోనే ఉండిపోవడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. తమ పంటలు కోతలకు వచ్చాయని, తాము వెళ్లకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే వేళ తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని కోరుతున్నారు. మౌంట్ అబూలో బ్రహ్మకుమారీస్ సంస్థ వారే తమకు భోజనం, వసతి సమకూరుస్తున్నారని వీరు చెబుతున్నారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా పసలపూడికి చెందిన బ్రహ్మకుమారీస్ ప్రతినిధి మాధవి ‘సాక్షి’కి తెలిపారు. మే 3న లాక్డౌన్ ఎత్తివేశాక తమను ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభ్యర్థిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటిస్తామన్నారు. తమకు సాయం చేయాలని రాజస్థాన్ సీఎంకు కూడా బ్రహ్మకుమారీస్ సంస్థ విజ్ఞప్తి చేసింది. -
సేవతో ప్రపంచాన్ని గెలవొచ్చు
హైదరాబాద్: నిస్వార్థం, సేవాతత్పరతతో ప్రపం చాన్ని గెలవొచ్చని బ్రహ్మకుమారీస్ చీఫ్, రాజయోగిని దాదీ జానకీ అన్నారు. హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఆమె ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ప్రతి వ్యక్తి సింపుల్‌గా ఉంటూనే శాంపిల్‌గా ఉండగలిగితే (హర్ ఆద్మీ ‘సింపుల్’రహెతే హువే ‘శాంపిల్’బన్నా హై) ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వగలిగే వారమవుతాం’అని అన్నారు. ప్రతి వ్యక్తి మధురత, నమ్రత, స్వచ్ఛత, ధీరత, విధేయత అనే ఐదు ప్రధాన అంశాలను గుర్తించి ముందుకు నడిస్తే అన్నింటా విజయం సాధ్యమేనన్నారు. ‘బ్రహ్మబాబా ఎంతోమంది పేర్ల ను మార్చినప్పటికీ నా పేరు జానకీ అని, అందులో జాన్ కీ ఉందని అందుకే నీవు జానకీగానే ఉండాలని సూచించారు’అని ఆమె గుర్తు చేశారు. బాబా సూచనతో నా కర్తవ్యం అర్థమైందన్నారు. మనం ఏ పనిచేసినా అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించవద్దని, అన్ని పనులు చేయడమే మనం అలవర్చుకోవాలన్నారు. పరమేశ్వరుడే పరమాత్మ అని, అతనిలోనే తల్లి, తండ్రి, సద్గురు ఉన్నాడని, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటేనే మనం సుఖజీవనాన్ని సాగిస్తామని చెప్పారు. శాంతి ప్రధాత భగవంతుడు మాత్రమేనని, వారితో సంబంధం ఏర్పర్చుకున్న ప్రతి ఒక్కరికీ ఇది లభ్యమ వ్వగలదన్నారు. సుఖాన్ని ఎలా పొందడం.. ఎలా పంచడం.. అనే విషయాలను పూర్తిగా గ్రహించాలన్నారు. ప్రకృతితో మమేకమయితే అన్ని అంశాలు గ్రహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్సీబీసీ) మాజీచైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, శాట్స్ వీసీ, ఎండీ దినకర్‌బాబు, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జోనల్ ఇన్చార్జి సంతోష్ దీదీ, రాజయోగి మృత్యుంజయ, శాంతిసరోవర్ డైరెక్టర్ కులదీప్ దీదీ, తెలంగాణ, ఏపీలకు చెందిన బ్రహ్మకుమారీస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అట్టహాసంగా ‘ఇన్నర్ స్పేస్’ప్రారంభం హైదరాబాద్ బ్రహ్మకుమారీస్ సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించిన ‘ఇన్నర్ స్పేస్’భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ సమక్షంలో దాదీ జానకీ ప్రారంభించారు. ఆధునిక ప్రపంచానికి ఆధునిక తరహాలో ఆధ్యాత్మిక చింతన కలగచేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా యువతలో ఒక చైతన్య స్పూర్తిని ఉత్సాహన్ని అందించే దిశగా ఈ సెంటర్లో మెడిటేషన్రూమ్, ఆర్ట్‌గ్యాలరీ, 3ఎం(మైండ్, మ్యాటర్, మెడిటేషన్), 3ఎస్( సైనర్జీ,సైన్స్, స్పిరిచువ్యాలిటీ)వంటి సిద్ధాంతాలతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుముందు నగరంలోనే అతిపెద్ద బ్రహ్మకుమారీస్ సంస్థ పతాకాన్ని దాదీ జానకీ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా జైన్ హెరిటేజ్ విద్యార్థులు రూపొందించిన దశావతారాల నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
మంచిని పండించాలి
కడప కల్చరల్: రైతులు ఆధ్యాత్మిక క్షేత్రంలో మంచిని పండించాలని బ్రహ్మకుమారీల జిల్లా కో–ఆర్డినేటర్ గీతా బెహన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఓం శాంతినగర్‌లోని బ్రహ్మకుమారీ ఈశ్వరియా విశ్వవిద్యాలయం జిల్లా కార్యాలయంలో ‘శాశ్విత యోగిక వ్యవసాయం’ పేరిట ఏర్పాటు చేసిన రైతు శిక్షణా శిబిరాన్ని అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రంతో రైతుకు గల అనుబంధం గొప్పదని, లోకానికి అన్నదాతగా నిలిచిన రైతు రుణం తీర్చుకోలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాశ్విత యోగిక వ్యవసాయం అవసరం ఎంతైనా ఉందని, మంచి భావాలతో చేసే వ్యవసాయం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రధాన కార్యాలయమైన మౌంట్ ఆబుకు చెందిన గ్రామ వికాస విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు బ్రహ్మకుమార్ సుమంత్ ఈ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పండించే పంట వాడిన వారికి శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. అందుకు యోగిక వ్యవసాయం ఉత్తమమైన మార్గమన్నారు. కార్యక్రమంలో జైపూర్‌కు చెందిన బ్రహ్మకుమార్లు ప్రహ్లాద్, కర్ణాటక జాంఖండికి చెందిన శేఖర్, చిత్తూరుకుచెందిన బ్రహ్మకుమారి వీణలు కూడా సేంద్రీయ ఎరువుల వాడకం, వ్యవసాయంలో ఆధ్యాత్మికతను అనుసంధానించడం, యోగా విధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు.