మంచిని పండించాలి
కడప కల్చరల్:
రైతులు ఆధ్యాత్మిక క్షేత్రంలో మంచిని పండించాలని బ్రహ్మకుమారీల జిల్లా కో–ఆర్డినేటర్ గీతా బెహన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఓం శాంతినగర్‌లోని బ్రహ్మకుమారీ ఈశ్వరియా విశ్వవిద్యాలయం జిల్లా కార్యాలయంలో ‘శాశ్విత యోగిక వ్యవసాయం’ పేరిట ఏర్పాటు చేసిన రైతు శిక్షణా శిబిరాన్ని అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రంతో రైతుకు గల అనుబంధం గొప్పదని, లోకానికి అన్నదాతగా నిలిచిన రైతు రుణం తీర్చుకోలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాశ్విత యోగిక వ్యవసాయం అవసరం ఎంతైనా ఉందని, మంచి భావాలతో చేసే వ్యవసాయం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రధాన కార్యాలయమైన మౌంట్ ఆబుకు చెందిన గ్రామ వికాస విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు బ్రహ్మకుమార్ సుమంత్ ఈ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పండించే పంట వాడిన వారికి శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. అందుకు యోగిక వ్యవసాయం ఉత్తమమైన మార్గమన్నారు. కార్యక్రమంలో జైపూర్‌కు చెందిన బ్రహ్మకుమార్‌లు ప్రహ్లాద్, కర్ణాటక జాంఖండికి చెందిన శేఖర్, చిత్తూరుకుచెందిన బ్రహ్మకుమారి వీణలు కూడా సేంద్రీయ ఎరువుల వాడకం, వ్యవసాయంలో ఆధ్యాత్మికతను అనుసంధానించడం, యోగా విధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు.