కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేస్తాం: జైరాం రమేశ్
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి
అన్ని సెంటిమెంట్లను కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటాం
సాక్షి, నిజామాబాద్/ న్యూస్‌లైన్, కరీంనగర్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హామీ ఇచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం మనస్సులో ఉందన్నారు. తెలంగాణకు కాబోయే సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రాహుల్‌గాంధీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజుకు అప్పగించారని చెప్పారు. జైరాం రమేశ్ సోమవారం నిజామాబాద్, కరీంనగర్‌లో విలేకరుల సమావేశాల్లో, నిజామాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఇక్కడ సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
ఇది టీ-20 మ్యాచ్ కాదని, సుదీర్ఘ ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, తెలంగాణను మరో జార్ఖండ్‌లా కానీయొద్దని అన్నారు. టీఆర్‌ఎస్ ఏర్పడిన 2001కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కోరిందని తెలిపారు. 2000లో బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటు ఏమైందని ఆ పార్టీ నేత ఎల్‌కే అద్వానీకి సోనియా లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో టీఆర్‌ఎస్ పాత్ర శూన్యమని అన్నారు. అన్ని సెంటిమెంట్లను కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటామని తెలిపారు.
టీఆర్‌ఎస్‌తో పొత్తుపై అత్యున్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సొంతంగా గెలిచేంత బలం ఉందంటున్నారని చెప్పారు. హైదరాబాద్ ఆదాయం పూర్తిగా తెలంగాణకే చెందుతుందని, ఇక్కడ ఎవరైనా ఉండవచ్చని తెలిపారు. 1959, 1979, 2002, 2009లలో వెలువడిన తీర్పులు, రాజ్యాంగంలోని ఆర్టికల్-3, 4 ప్రకారమే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. విభజనపై ఎవరు కోర్టుకు వెళ్లినా ఒరిగేదేమీ లేదన్నారు. సింగరేణిపై పూర్తి అధికారం తెలంగాణ రాష్ట్రానికే ఉంటుందని చెప్పారు. తెలంగాణలో నాలుగేళ్లలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటు నిర్మిస్తామని, ఇది గ్యాస్ ఆధారితమా, బొగ్గు ఆధారితమా అనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి పదేళ్ల పాటు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలోనూ పరిశ్రమలకు పన్ను రాయితీ ఉంటుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు.
తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే పార్టీ తరపున అవకాశం ఇస్తామన్నారు. సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, అందువల్లే ఇన్ని చిక్కులు వచ్చాయని అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు చర్చకు వచ్చినప్పుడు బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు భిన్నమైన ప్రకటనలు చేసి ద్వంద్వ విధానాన్ని ప్రదర్శించారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఈ నెల 19న తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను కలుస్తామని చెప్పారు. ఈనెల 18న సీమాంధ్ర, తెలంగాణ జేఏసీలతో భేటి అవుతామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్ సీఎంగా ఉండగా చట్టం కూడా చేశారని తెలిపారు. అయితే, న్యాయపరమైన సమస్యలతో రిజ ర్వేషన్ నిలిచిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ మంత్రులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్, ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.
అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ మారాడా!
‘అనంత వె ంకట్రామిరెడ్డి పార్టీ మారాడా..! అయితే ఓకే ఓకే’.. అంటూ జైరాం రమేశ్ విలేకరుల సమావేశంలో తడబడ్డాడు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డిలు పార్టీ మారడంపై స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. పదవులు, అధికారం కోసం పాకులాడే వారు వెళ్లారు’ అని అన్నారు. ఇదే సందర్భంగా పార్టీలో జనాకర్షణ, సత్తా ఉన్న రఘువీరారెడ్డి, మాణిక్యవరప్రసాద్, చింతా మోహన్, అనంత వెంకట్రామిరెడ్డిలాంటి నేతలున్నారని అన్నారు. పక్కనే ఉన్న డి.శ్రీనివాస్, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌లు కలుగచేసుకుని ‘అనంత’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. దీంతో ‘ అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ మారారా... ఒకే ఒకే ’ అని అన్నారు.
తెలంగాణకు దళితుడే సీఎం: జైరాం రమేశ్
Published Tue, Mar 11 2014 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement